YCP: 24న వైసీపీ సంచలన నిర్ణయం తీసుకోబోతోందా..?

ఆంధ్రప్రదేశ్ లో పునర్వైభవం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూసిన ఆ పార్టీ, ప్రజల్లో తిరిగి ఆదరణ పొందేందుకు ప్రతిరోజూ ఏవో కార్యక్రమాలు చేపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల చెంతకు రాకుండా ఉండిపోయారు జగన్ (YS Jagan). కానీ ఇప్పుడు మాత్రం ఆ పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీపరంగా నిత్యం కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అసెంబ్లీకి (AP Assembly) వెళ్లకపోవడం, జగన్ జనాల్లోకి రాకపోవడం లాంటివి ఇప్పటికీ విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 24న పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది వైసీపీ. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
24న వైసీపీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్లే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో అసెంబ్లీకి వెళ్లట్లేదనే విమర్శలు పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. 11 సీట్లకు ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా జగన్ ఇలా పట్టుబట్టడం సరికాదని పలువురు సూచిస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా సభకు రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. జగన్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా సభకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలను సభకు పంపేందుకు జగన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఇక రెండోది మూకుమ్మడి రాజీనామాలు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు.. లాంటివి ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లిక్కర్ స్కాం కేసులో జగన్ ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కూటమి దూకుడు చెక్ పెట్టేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేద్దామనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశాల్లో జగన్ ఈ మేరకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు వస్తాయని, వాటిలో మళ్లీ గెలవడం ద్వారా కూటమిపై వ్యతిరేకతను నిరూపించవచ్చని భావిస్తున్నారట. అయితే జగన్ ప్రతిపాదనకు పార్టీలోనే మెజారిటీ నేతలు అంగీకరించట్లేదని సమాచారం. ఒకవేళ ఒకసీటులో ఓడిపోయినా కూడా కూటమిదే పైచేయిగా నిలుస్తుందని, ఇలాంటి ఆలోచన విరమించుకుంటే బాగుంటుందని చెప్పారట. కాబట్టి రాజీనామాల అంశంపై పెద్దగా చర్చ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
మూడోది వరుస ఉద్యమాలు. రాష్ట్రంలో అనేక సమస్యలు ప్రజలు వేధిస్తున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని వైసీపీ భావిస్తోంది. మెడికల్ కాలేజీలు, యూరియా కొరత, ఆరోగ్య శ్రీ.. లాంటివాటిపై ఇప్పటికే పార్టీ పోరుబాట సాగిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్, మద్యం విధానం.. లాంటివాటిపై మరింత దూకుడుగా ముందుకెళ్ళాలనుకుంటోంది. ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమై జగన్ కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇకపై జగన్ కూడా అడపాదడపా జనంలోకి వెళ్లి ఉద్యమాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి 24న వైసీపీ కీలక సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదిక కాబోతోంది.