Revanth Reddy: భావితరాల కోసమే ఫ్యూచర్ సిటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) నిర్మాణ కార్యాచరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ అత్యాధునిక కార్యాలయ భవనం నాలుగు నెలల్లో పూర్తి కానుంది. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచం అబ్బురపడేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మన ప్రాంతం గురించి బయటి దేశాలవారు గొప్పగా చెప్పుకొనేలా చేయాలన్నదే తన సంకల్పమని ప్రకటించారు. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని, ప్రపంచమంతా దీనివైపే చూసేలా చేయాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఒక మంచి ఆలోచనతో ఫోర్త్ సిటీ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఈ బృహత్తర కార్యక్రమానికి వరుణుడు కూడా ‘‘సహకరించాడని అన్నారు. ‘కుతుబ్‌షాహీలు, నిజాంలు పునాదులు వేసిన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు నేడు ఎంతో అభివృద్ధి చెందాయి. నాడు వైఎస్సార్ మాకెందుకు అనుకుని ఉంటే.. ఇవాళ హైటెక్‌సిటీ, ఔటర్‌రింగ్‌రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వచ్చేవి కాదు. నాటి నాయకుల ఆలోచన వల్లే ఫార్మా, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీపడుతున్నాం. సిలికాన్ వ్యాలీలో మన పిల్లలు గొప్ప స్థానాల్లో ఉన్నారు. గతకాలపు నేతల నుంచి మంచిని నేర్చుకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. భవిష్యత్తు తరాల కోసమే భారత్ ఫ్యూచర్ సిటీ. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్ తరహాలో ఫ్యూచర్‌సిటీ గురించి గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతాం. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్‌లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్ సిటీ గురించి చెప్పుకునేలా అభివృద్ధి చేస్తాం’అని సీఎం తెలిపారు. దేశంలో చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అక్కడ అద్బుతంగా ఉందని చెబుతుంటారు.. ఎన్నాళ్లు మనం న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి మాట్లాడుకుంటాం.. మనం కూడా అలా తయారు కావాలి కదా అన్నారు. పదేళ్లు సమయం ఇవ్వండి న్యూయార్క్ ను మరిపించే నగరం కడతానని పేర్కొన్నారు. 70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా అని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్‌ను న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తానని.. న్యూయార్క్ ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తానన్నారు. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు పోటీగా నిర్మించకూడదని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 500 ఫార్చ్యూన్ కంపెనీలు ఉండగా, అందులో 85 మాత్రమే భారత్‌లో ఉన్నాయన్నారు. ప్రపంచంలోని ప్రతి కంపెనీ భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా చేస్తానన్నారు. డిసెంబరు నాటికి ఫ్యూచర్ సిటీ భవన నిర్మాణం పూర్తవుతుందన్నారు. అప్పట్నుంచి నెలకు మూడు సార్లు ఇక్కడికొచ్చి కూర్చొని ప్రపంచాన్ని ఇక్కడికి రప్పిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నెలకు నాలుగు సార్లు వచ్చి కూర్చొంటారని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నామని.. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కూడా కేంద్రాన్ని ఒప్పించామని తెలిపారు. అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ వస్తుందని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని.. కోర్టుల చుట్టూ తిరిగి నష్టపోవొద్దని.. ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని భూనిర్వాసితులకు సూచించారు.
తనకు ఫ్యూచర్ సిటీలో భూములు ఉన్నాయని ప్రచారం, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజంగా తనకు ఇక్కడ ఎకరం భూమి కూడా లేదని..అలా ఉంటే అందరికి తెలుస్తుంది కదా అని వ్యాఖ్యానించారు. అభివృద్ధిని అడ్డుకోవటానికి తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘ నాకు ఫ్యూచర్ సిటీలో భూములు లేవు అని స్పష్టం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలతో వ్యాపారాలు నిర్వహించే సింగరేణి సంస్థకు గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయం కోసం ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సూచించారు. గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయం ద్వారా సింగరేణి ఇక్కడి నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తుంటే.. అనేక దేశాలు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచనల మేరకు అదే సభలో సింగరేణి గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయానికి 10 ఎకరాల స్థలం కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉందన్నారు. ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, అంతర్జాతీయ స్టేడియం వంటి నిర్మాణాలతో ఫ్యూచర్ సిటీ అద్భుతమైన నగరంగా నిర్మాణం కాబోతోందన్నారు. దేశంలో ఏ నగరంలో లేనట్టుగా ఎలివేటెడ్ కారిడార్లతో అద్భుతమైన రోడ్లు, మధ్యన మెట్రో రైలు వస్తుందన్నారు. 436 ఏళ్ల కిందట కులీ కుతుబ్షాల పాలనలో ఇరాన్ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ నగరానికి పునాదులు వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆనాటి రాజ్యం అవసరా లకు దక్షిణ మూసి అనువైన ప్రాంతంగా గుర్తించడంతో ప్రపంచ పటంలో సుసంపన్న మైన స్థానం దక్కించుకొని హైదరాబాద్ నగరం రూపుదిద్దుకుందని అన్నారు. నదలున్నిటిని చేపలతో నింపినట్టు నా నగరాన్ని జనాభాతో నింపాలని ఆ సమయంలో కులీకుతుబ్‌షా దేవుని ప్రార్థించాడని గుర్తు చేశారు. అయితే.. కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని ఎలా నిలబెట్టారో.. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో క రీడిన అనేక కార్యక్రమాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కాబోతుండగా కులీ కుతుబ్ షా నాటి రోజులు గుర్తుకు వస్తున్నా యని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నగరం చరిత్రలో నిలిచి పోతోందని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఫ్యూచర్ సిటీ పనులు ప్రారంభం…
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్య అనుసంధానాన్ని కల్పించనున్న రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రావిర్యాల్ ఓఆర్ఆర్ ఇంటర్‌ఛేంజ్ నుంచి ఆమన్‌గల్ వరకు నిర్మించ తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక రహదారి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల్లోని 14 గ్రామాల మీదుగా రెండు దశల్లో ఈ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 41.50 కిలోమీటర్లు కాగా.. ఇందుకోసం మొత్తం రూ. 4,621 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా హెచ్ఎండీఏ ఇప్పటికే టెండర్లను ఖరారు చేసింది. ఈ రహదారి నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంతో అర్బన్, గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ‘ఫ్యూచర్ సిటీ’కి ఒక ప్రత్యేక కారిడార్‌గా ఉపయోగపడుతుంది. తద్వారా ఆ ప్రాంతంలో ఐటీ పార్కులు, పరిశోధన కేంద్రాలు, ఆధునిక నివాస సముదాయాల ఏర్పాటుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ రోడ్డు ఈ-సిటీకి అనుసంధానం కావడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ‘మేక్ ఇన్ తెలంగాణ’ కార్యక్రమానికి కూడా తోడ్పాటునందించనుంది. రహదారిని 100 మీటర్ల రైట్ ఆఫ్ వేతో కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దీన్ని 3ం3 లేన్ల మెయిన్ క్యారేజ్‌వేగా రూపొందిస్తున్నారు, భవిష్యత్తులో దీన్ని 4ం4 లేన్ల వరకు విస్తరించే అవకాశం ఉంది. రహదారి మొత్తం పొడవులో.. 8.94 కిలోమీటర్ల మేర మార్గం 7 రిజర్వు ఫారెస్ట్ బ్లాకులలో (సుమారు 236.89 ఎకరాలు) వెళ్తుంది. వీటికి సంబంధించిన అనుమతుల కోసం హెచ్ఎండీఏ ఇప్పటికే దరఖాస్తు చేసింది. అదనంగా 7.69 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం కోసం టీజీఐఐసీ కి చెందిన 310 ఎకరాలు అవసరం కానుంది.
రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారిని రెండు ప్రధాన దశల్లో నిర్మించనున్నారు. తొలి దశ 19.20 కి.మీ రావిర్యాల్ ఓఆర్ఆర్ ఇంటర్‌ఛేంజ్ నుంచి మీర్ఖాన్పేట వరకు నిర్మిస్తారు. భూసేకరణతో కలిపి రూ. 1,911 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ రహదారిని కొంగరకుర్దు, ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్ గ్రామాల మీదుగా ఈ మార్గం వెళ్తుంది. రెండో దశలో 22.30 కి.మీ మేర మీర్ఖాన్పేట నుంచి ఆమన్‌గల్ వరకు నిర్మిస్తారు. ప్రాజెక్టు వ్యయం భూసేకరణతో కలిపి రూ. 2,710 కోట్లు. ఈ రహదారిని కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆకుతోటపల్లి, ఆమన్‌గల్ గ్రామాల మీదుగా నిర్మిస్తారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఆయా గ్రామాలకు మహర్దశ పట్టనుంది.






