కేసులు నమోదైన ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్టు తాత్కాలిక రద్దు!
హైదరాబాద్ నగరంలో కేసులు నమోదై విదేశాలకు పరారైన ఎన్నారై భర్తల ఆటకట్టించేందుకు సీసీఎస్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారి పాస్‌పోర్టులను తాత్కాలికంగా రద్దు చేయించేందుకు చర్యలను ప్రారంభించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయి, విదేశాల్లో ఉంటున్న వారి జాబితాను సీసీఎస్ మహిళా పోలీసులు సిద్ధం చేశారు. ఎన్ఆర్ఐ భర్తలపై కేసుల్లో ఏండ్ల తరబడి పురోగతి ఉండడం లేదు. ఇందుకు కారణం వారు స్వదేశానికి వస్తే పట్టుబడడం, లేకుంటే లేదు. ఇలాంటి కేసులపై సీసీఎస్ డీసీపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయి, కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారి పాస్‌పోర్టులను విదేశీ వ్వవహారాల శాఖ సహకారంతో తాత్కాలికంగా రద్దు చేయించేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ దిశగా సీసీఎస్ పోలీసులు చర్యలను ప్రారంభించారు.
