రైతుల కష్టాలు చూసి వెయ్యి అదనంగానే ఇచ్చాం : సీఎం జగన్

కోవిడ్ కష్టకాలంలో రైతులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదని వైఎస్సార్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేశామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దాదాపు 52.38 లక్షల రైతులకు రైతు భరోసా మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా రైతుల ఖాతాల్లో నేరుగా 3,928 కోట్లను జమ చేస్తున్నామని ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ఈ విడుదలను విడుదల చేశారు. రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి చేకూరుతోందని, ఇప్పటి వరకూ 89 వేల కోట్లు ప్రజల ఖాతాలోకి నేరుగా పంపామని తెలిపారు. గత 23 నెలల్లో రైతు భరోసా కింద 17 వేల 29 కోట్లను విడుదల చేశామని, ఇన్‌పుట్ సబ్సిడీ కింద 1,038 కోట్లను ఇచ్చామని పేర్కొన్నారు. ఎక్కడా వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, ఏ అర్హుడూ మిస్ కాకుండా అందరికీ ప్రయోజనం కల్పించామని, ప్రతి పేదవాడికి సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేశామని సీఎం జగన్ తెలిపారు. మేనిఫెస్టోలో ఏటా 12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా, రైతుల కష్టాలు చూసి ఏడాది ముందుగానే మరో వెయ్యి అదనంగానే ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు.