Shrimp Exports: భారతీయ రొయ్యలపై సుంకాలు వేయబోతున్న అమెరికా!

అమెరికాలో భారత్ నుండి దిగుమతి అవుతున్న రొయ్యలపై (Shrimp Exports) సుంకాలు విధించేందుకు కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. హెచ్1బీ వీసాల ఫీజు పెంచిన సమయంలోనే ఈ వార్త రావడం చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన పలువురు భారతదేశాన్ని అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. అయితే లూసియానాలోని రొయ్యలు, క్యాట్‌ఫిష్ పరిశ్రమలను కాపాడటం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని యూఎస్ (USA) అధికారులు చెప్తున్నారు.
ఈ క్రమంలోనే అమెరికా సెనేటర్లు బిల్ క్యాసిడీ, సిండీ హైడ్-స్మిత్ కలిసి “ఇండియా ష్రింప్ టారిఫ్ చట్టం”ను (India Shrimp Tariff Act) ప్రతిపాదించారు. భారత్ నుండి తక్కువ ధరలకు దిగుమతి అవుతున్న రొయ్యలు (Shrimp Exports) తమ దేశీయ రొయ్యల పరిశ్రమకు నష్టం కలిగిస్తున్నాయని వీరు వాదిస్తున్నారు. సెనేటర్ బిల్ క్యాసిడీ మాట్లాడుతూ.. లూసియానాలో గంబో, జంబాలయ, ష్రింప్ వంటి వంటకాల రుచి చూసేందుకు దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తారన్నారు. తమ రాష్ట్రంలోని మత్స్యకారులు అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తారని, అందుకే ఈ రంగాన్ని రక్షించడం తమ కర్తవ్యమని ఆయన అన్నారు.
సరైన నిబంధనలు లేకుండా భారత్ నుంచి వస్తున్న రొయ్యలు (Shrimp Exports).. లూసియానా సీఫుడ్ మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయని సెనేటర్ సిండీ హైడ్-స్మిత్ ఆరోపించారు. ఈ కొత్త చట్టం దేశీయ జాలర్లకు రక్షణ కల్పిస్తుందని ఆమె తెలిపారు. అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ చట్టానికి తాను మద్దతు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ బిల్లు కనుక చట్టరూపందాలిస్తే.. భారత్ నుండి అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యల పరిశ్రమపై (Shrimp Exports) తీవ్రమైన ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.