H1B Visa: హెచ్1బీ వీసా ఫీజుపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్

ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా (H1B Visa) ఫీజును భారీగా పెంచడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో హెచ్1బీ వీసా (H1B Visa) హోల్డర్లలో 71 శాతం మంది భారతీయులే ఉన్నారనే వార్తను షేర్ చేస్తూ.. “భారతదేశానికి బలహీనమైన ప్రధాని ఉన్నారు” అంటూ పోస్టు పెట్టారు. మోడీ (PM Modi) బలహీన నాయకత్వం కారణంగానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.
మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కూడా మోడీ (PM Modi) విదేశాంగ విధానంపై విమర్శలు గుప్పించారు. మోడీ విదేశీ విధానం కేవలం “కౌగిలింతలు, నినాదాలు, కెమెరా క్లిక్‌లకే” పరిమితమైందని ఆయన ఆరోపించారు. ఇటీవల మోడీ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ చేసిన ఫోన్ కాల్‌ను కూడా ఖర్గే (Mallikarjun Kharge) గుర్తుచేశారు. “మీ బర్త్‌డే కాల్ తర్వాత భారతీయులకు అందిన ‘రిటర్న్ గిఫ్ట్‌లు’ చాలా బాధ కలిగిస్తున్నాయి. ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అని మీరు ప్రచారం చేసిన ప్రభుత్వం నుంచే ఈ రిటర్న్ గిఫ్ట్‌లు వస్తున్నాయి” అంటూ విమర్శలు చేశారు. అమెరికా ప్రతిపాదించిన హైర్ చట్టం, అలాగే చాబహర్ పోర్ట్ ప్రాజెక్టుపై ఆంక్షలను మినహాయించిన నిర్ణయాన్ని యూఎస్ వెనక్కు తీసుకోవడం కూడా భారతీయులనే లక్ష్యంగా చేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సుంకాల వల్ల భారతదేశానికి ఇప్పటికే ₹2.17 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన (Mallikarjun Kharge) పేర్కొన్నారు.