TTA: అమెరికా వ్యాప్తంగా టీటీఏ బతుకమ్మ, దసరా వేడుకలు.. ఎప్పుడెక్కడంటే?

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) తమ సంప్రదాయ కార్యక్రమం అయిన బతుకమ్మ/దసరా వేడుకలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. టీటీఏ (TTA) అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో ఈ సంవత్సరం వేడుకలను గతంలో కంటే మరింత వైభవంగా నిర్వహించడానికి ఏర్పా్ట్లు జరుగుతున్నాయని టీటీఏ తెలిపింది. అమెరికాలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను ఈ వేడుకలు ప్రతిబింబిస్తాయని పేర్కొంది. అదే సమయంలో నేషనల్ బతుకమ్మ అడ్వైజర్‌గా నియమితురాలైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవితా రెడ్డికి టీటీఏ అభినందనలు తెలియజేసింది.
టీటీఏ (TTA) వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, సలహా మండలి అధ్యక్షులు డాక్టర్ విజయపాల్ రెడ్డి, సహ-అధ్యక్షులు డాక్టర్ మోహన్ రెడ్డి పాతలోళ్ల, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, శ్రీని అనుగు, గత అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల తమను అండగా ఉండి ప్రోత్సహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అలాగే దసరా, బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్న అన్ని టీటీఏ (TTA) శాఖలకు వారి మద్దతు ఉంటుందని తెలియజేశారు.
సెప్టెంబరు 21న ఈ వేడుకలు ఇండియానాపోలిస్, న్యూజెర్సీ, డల్లాస్, టంపా, పోర్ట్‌లాండ్‌లో టీటీఏ (TTA) నిర్వహించనుంది. సెప్టెంబర్ 27న సియాటెల్, అరిజోనాలో జరుగుతాయి. సెప్టెంబర్ 28న న్యూయార్క్, షార్లెట్, లాస్ ఏంజిల్స్, బోస్టన్‌లో బతుకమ్మ, దసరా వేడుకలను టీటీఏ నిర్వహిస్తుంది. అక్టోబర్ 4న అట్లాంటా, ఫిలడెల్ఫియాల్లో.. అలాగే అక్టోబర్ 11న అలబామాలో ఈ టీటీఏ (TTA) బతుకమ్మ, దసరా వేడుకలు జరగనున్నాయి.