అమరావతి వద్ద సప్త ద్వీపాలు
రాజధాని అమరావతి పరధిలో కృష్ణానదిలో ఉన్న ఏడు ప్రధాన దీవుల్ని పర్యాటక ఆకర్షక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దాదాపు 2400 ఎకరాల విస్తీర్ణంలోని ఈ దీవుల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి తన నివాసంలో సమీక్షించారు. రాజధాని మీదుగా వెళుతున్న జాతీయ రహదారి బైపాస్ రోడ్డు పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ పనులు దక్కించుకున్న గామన్ ఇండియా సంస్థ సకాలంలో పనులు పూర్తి చేస్తుందో లేదో కనుక్కోవాలని ఆదేశించారు. బైపాస్ రోడ్డు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఆర్డీఏ, ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. రహదారులంటే కేవలం వాహనాలు తిరిగేందుకే కాదని, అవి అభివృద్ధికి బాటలని అన్నారు. రాజధానిలో చేపట్టిన ఏడు రహదారుల నిర్మాణ పనుల్ని సకాలంలో పూర్తిచేయాలన్నారు. అన్ని ముఖ్య రహదారులు అంతర్, బాహ్య వలయ రహదారులతో అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. త్వరలో టెండర్లు పిలిచేందుకు సిద్ధం చేస్తున్న మరో 11 రహదారుల ప్రణాళికల్ని కూడా ఆయన సమీక్షించారు. భవిష్యత్తులో రాజధాని లో ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.
