పెట్టుబడులకు ఏపీ అనుకూలం : గంటా
ఆంధ్ర ప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు రావాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు కోరారు. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు రష్యాలోని చెలియాబినిస్క్ ప్రాంత ప్రతినిధి వర్గం విశాఖపట్నం చేరుకుంది. వారితో సమవేశమైన మంత్రి గంటా తదితరులు రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలను వివరించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనువైందని తెలిపారు. అంత్యంత పొడవైన సముద్రతీరం ఉన్నందున ఎపిలో నౌక నిర్మాణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. యంత్ర పరికరాల తయారీకి పేరొందిన చెలియాబినిస్క్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆశిస్తున్నామని అన్నారు. ఏపిలో ఉన్న భారీ ఖనిజ సంపదను వెలికితీసే పరిజ్ఞానం, యంత్రపరికరాల పరిశ్రమల ఏర్పాటు పైనా పరిశీలించాలని కోరారు. మూడు పారిశ్రామిక కారిడార్లు, ఒక తీర ప్రాంత ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. చెలియాబినిస్క్ రీజియన్ గవర్నర్ బోరిస్ డుబ్రోవిస్కీ మాట్లాడుతూ మెటలర్జీ, యంత్రాల తయారీలో తమ ప్రాంతం అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూడా తమ ప్రాంతంలోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు.
