Pawan Kalyan: వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి : పవన్ కల్యాణ్
మొంథా తుపాను ప్రభావంతో విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్ల (Collectors)తో ఆయన సమీక్ష నిర్వహించారు. మొంథా ప్రభావంపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. తుపాను బలహీనపడినా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వసతి కల్పించాలని స్పష్టం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈదురు గాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, నెల్లూరు జిల్లాలో పెన్నా నది, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయిని, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.







