Jai Bhim: జై భీమ్ కు అవార్డుల పంట
నేషనల్ అవార్డులు వచ్చినప్పుడల్లా ఫలానా సినిమాకు అన్యాయం జరిగిందని, ఫలానా సినిమాకు రావాల్సిన గుర్తింపు రాలేదనో కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాల లిస్టులో కోలీవుడ్ మూవీ జై భీమ్(jai bhim) కూడా ఒకటి. సూర్య(Suriya) హీరోగా టీజీ జ్ఞానవేల్(TG Gnanavel) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
ఇంతటి గొప్ప సినిమాకు నేషనల్ అవార్డు రావడం ఖాయమని సినిమా చూసిన వారంతా అప్పట్లో అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా జై భీమ్ సినిమాకు ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం ఎంతో మందిని నిరాశ పరిచింది. జై భీమ్ కు నేషనల్ అవార్డు రాకపోవడంపై ఎంతోమంది నోరు విప్పి మాట్లాడారు కూడా. అయితే ఇక అసలు విషయానికొస్తే తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ఫిల్మ్ అవార్డులను అనౌన్స్ చేసింది.
2016 నుంచి 2022 మధ్యలో రిలీజైన సినిమాలకు గానూ తమిళనాడు ప్రభుత్వం అవార్డులను అనౌన్స్ చేయగా, అందులో జై భీమ్ సినిమాకు ఏకంగా ఏడు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ సినిమా, ఉత్తమ డైరెక్టర్, సహాయ నటుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్, ఉత్తమ నేపథ్య గాయకుడు విభాగాల్లో జై భీమ్ కు అవార్డులు రావడంతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






