Pakistan: భారత్ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్యం.. పాకిస్తాన్ లో టెన్షన్…
భారత్-ఈయూ ఒప్పందం అమెరికాకు మాత్రమే కాదు.. పాకిస్తాన్ ను భయపెడుతోంది.ఇది స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కావడంతో…దీని ప్రభావం తమ ఎగుమతులపై ఎంతవరకూ పడుతుందన్నది
పాక్ వ్యాపారులు, ఆ దేశ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒప్పందం కుదరడం, దానిలోని అంశాలు బయటకు రావడంతోనే పాక్ అప్రమత్తమైంది. దీని ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈయూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాకిస్థాన్ తెలిపింది.
పాకిస్థాన్ (Pakistan) ఎగుమతుల విషయంలో యూరప్ అదిపెద్ద మార్కెట్ గా ఉంది. తాజా ఒప్పందం నేపథ్యంలో.. ఈయూ మార్కెట్లో తమకున్న ఆధిపత్యాన్ని కోల్పోతామేమోనని పాక్ వ్యాపార వర్గాల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఈయూతో సంప్రదింపుల ద్వారా తమ మార్కెట్ పోకుండా చూసుకోవాలన్నది పాక్ ప్రభుత్వం ఆలోచనగా ఉంది.
వాణిజ్యం విషయంలో 2014లో పాకిస్థాన్‌కు ఈయూ ‘జీఎస్పీ+’ హోదా ఇచ్చింది. దీని కింద రాయితీ సుంకాల కారణంగా యూరప్ కు పాకిస్థాన్ టెక్స్టైల్స్ ఎగుమతులు 108 శాతం పెరిగాయి. ఇరు పక్షాల మధ్య వాణిజ్య విలువ 12 బిలియన్ యూరోలకు చేరువైంది. అయితే, ఈ హోదా గడువు వచ్చే ఏడాది డిసెంబరుతో ముగియనుంది.
‘‘జీఎస్పీ+ స్కీం ద్వైపాక్షిక సహకారానికి విజయవంతమైన నమూనాగా పాక్ సర్కార్ చెబుతోంది. ఈ ఒప్పందం ద్వారా పాక్ నుంచి ఈయూ దేశాలకు టెక్స్టైల్స్ ఎగుమతులు అక్కడి మార్కెట్ అవసరాలను సరసమైన ధరల్లోనే తీరుస్తున్నాయి. గత ఏడాది తమ మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చల సందర్భంగా జీఎస్పీ+ అంశం చర్చకు వచ్చినట్లు పాక్ ప్రతినిధులు చెబుతున్నారు.






