మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఐటి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛరణల సచివాలయం ఐదో బ్లాక్ కింది అంతస్థులో ఆయన ఛాంబర్లోకి అడుగు పెట్టి దేవతామూర్తులకు పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రి ఆయనకు శాలువా కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. లోకేశ్‌కు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ తొలుత మూడు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఏడాదిలో 50 రోజులు పనిచేసిన కటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించే దస్త్రంపై లోకేశ్ తొలి సంతకం చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. అనంతరం పంచాయతీరాజ్ ద్వారా గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ దస్త్రంపై, గ్రామాల్లో ఎల్ఈడీ దీపాల ఏర్పాటు ద్వారా దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఏపీ దస్త్రంపై ఆయన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ గ్రామాలు, తండాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రెండేళ్లలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.
