Davos: దావోస్‌లో చంద్రబాబు పర్యటన విజయవంతం
‘ఏపీ బ్రాండ్’ ఇమేజ్ ప్రచారం.. పెట్టుబడులకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) నాలుగురోజుల దావోస్(Davos) పర్యటన విజయవంతంగా ముగిసింది. తన పర్యటనలో ఆయన ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన సాగినట్లు కనిపిస్తోంది. నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్‌ను, ఎపి బ్రాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు, మంత్రి లోకేష్ కూడా ప్రమోట్ చేశారు.
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాట మంత్రులు నారా లోకేష్(Nara Lokesh), టీజీ భరత్‌తోపాటు రాష్ట్ర అధికారుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ప్రపంచం దేశాల నుంచి దావోస్‌కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు బృందం సంపూర్ణంగా సఫలమైంది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు తొలిరోజు పర్యటనలో ముందుగా జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్నికల్ టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు.. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృధుల్ కుమార్‌కు చెప్పారు.
స్విస్‌మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ట్ ఫిస్టర్, స్విస్ టెక్స్టైల్స్ సీఈవోలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఇన్నోవేషన్ హబ్‌లు, ఇంక్యుబేటర్ల ఏర్పాటు, స్విస్ వెట్ తరహాలో రాష్ట్రంలో ప్లంబింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు, శిక్షణ కార్యక్రమాలకు ‘స్విస్‌మెన్’ కంపెనీ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు.
ఓర్లికాన్ ప్రతినిధులతో సమావేశమైనప్పుడు రాష్ట్రంలో అడ్వాన్స్ కోటింగ్ సెంటర్ ఆవశ్యకత ఉందని, అలాగే ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఎనర్జీ, టూలింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, పరిశోధన కోసం ఏఎం సెంటర్ నెలకొల్పవచ్చని వీటిని ‘ఓర్లికాన్’ వినియోగించుకోవచ్చని చంద్రబాబు వివరించారు. ఆంగ్స్ట్ ఫిస్టర్: అడ్వాన్డ్స్ సీలింగ్ సొల్యూషన్స్ ప్లాంట్, యాంటీవైబ్రేషన్ సిస్టమ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయమని ‘ఆంగ్స్ట్ ఫిస్టర్’ను కోరారు. స్విస్ టెక్స్టైల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఏపీ టెక్స్టైల్ రంగంలో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం ‘స్విస్ టెక్స్ట్కెల్స్’కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు.
పర్యటన రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు.. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రత్యేక సెషన్లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ప్రసంగించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పది మార్గదర్శక సూత్రాలను ముఖ్యమంత్రి వివరించారు. భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలో ఏర్పాటు చేయబోయే గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు తన ప్రసంగంలో చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్‌కు చెందిన మార్స్క్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్‌తో చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖ లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటుతో పాటు, నెట్వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు.
దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్‌తో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి ఎల్జీ కెమ్ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా కోరారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట, విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు వున్న అవకాశాలను పరిశీలించమని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య పెట్టుబడుల కోసం ఎల్జీ కెమ్ సీఈవోను అంబాసిడర్‌గా ఉండాలని అభ్యర్ధించారు. పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రిరకింగ్ వాటర్, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు. అనకాపల్లిలో రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై ఆర్సెలార్ మిట్టల్/నిప్పన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్. మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. వెల్స్పన్ వెల్స్పన్ చైర్మన్ బీకే గోయింకాతో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.
పర్యటన మూడవ రోజు కూడా పలువురితో చంద్రబాబు సమావేశమయ్యారు. గూగుల్ క్లౌడ్ : సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్‌కు ముఖ్యమంత్రి సూచించారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని అన్నారు. మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెట్రోనాస్ కాకినాడ ప్లాంటులో రూ. 13,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లోనూ భాగస్వామి కావాలని ముహమ్మద్ తౌఫిక్‌ను కోరారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో సమావేశమైన ముఖ్యమంత్రి.. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకురావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్‌లో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. డీపీ వరల్డ్ సెంట్రల్ ఏసియా, ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాన్ సూమర్‌తో ఈ మేరకు చర్చలు జరిపారు. కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. స్విట్జర్లాండ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నిక్లాస్ శామ్యూల్ గుగ్గర్, యాక్సెస్ హెల్త్ కేర్ సీఈవో అనురాగ్ జైన్, వాడ్కు చెందిన కౌన్సిలర్ ఆఫ్ స్టేట్ క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్, ఇసాబెల్లా మోరెట్, సింగపూర్ డిప్యూటీ పీఎం హెంగ్ స్వీ కీట్, యూఎన్ అండర్ సెక్రటరీ జనరల్ అనాక్లాడియా రాస్బాచ్తో సమావేశమయ్యారు.
దావోస్ పర్యటనలో చివరిగా ఇండియన్ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల మంత్రులతో కలిసి మాట్లాడారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో భారత్ తొలిసారి ‘టీమిండియా’ భావనతో ఒకే వేదికపైకి వచ్చిందని, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా సదస్సులో పాల్గొన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. తమ దగ్గర పెట్టుబడుల కోసం రాష్ట్రాలన్నీ వేరువేరుగా పోటీపడినా, పరస్పరం సహకరించుకుని భారతదేశ సమైఖ్య స్ఫూర్తిని చాటాయని కొనియాడారు.
