Montha : తీరం దాటిన మొంథా.. పలు జిల్లాల్లో అలజడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ సమీపంలో మంగళవారం రాత్రి తీరం దాటిన మొంథా (Montha) తుపాను. తొలుత హెచ్చరించినంత తీవ్రంగా లేకపోయిన శ్రీకాకుళం (Srikakulam) నుంచి తిరుపతి (Tirupati) వరకు ఈదురుగాలులు, భారీవర్షాలతో ముంచేసింది. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుపాను ప్రభావం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. 1,204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 75,802 మందిని తరలించింది. వారికి అక్కడ ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించింది. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్వాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి. తుపాను ప్రభావంతో మంగవారం ఉదయం నుంచే తీరంలో అలల తీవ్రత పెరిగింది. అధిక వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాల్లో వందల చెట్లు నేలకూలాయి. సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసింది. విద్యుత్తు స్తంభాలు విరిగిపడిన చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించారు.







