రూ. 39,436 కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ (SIPB) పచ్చజెండా!
Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఏపీ పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 39,436 కోట్ల విలువైన 31 భారీ ప్రాజెక్టులకు ఈ సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ నూతన పరిశ్రమల ద్వారా రాష్ట్రంలోని 1,11,278 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇవి కూడా చదవండి
క్వాంటం వ్యాలీలో మూడు సంస్థలు:
అమరావతిని సాంకేతిక హబ్‌గా మార్చే క్రమంలో భాగంగా ‘క్వాంటం వ్యాలీ’లో మూడు ప్రముఖ సంస్థల ఏర్పాటుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి పెద్దపీట వేయాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
రాయలసీమ.. సౌరశక్తి కేంద్రం:
రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని ఆయన సూచించారు.
వ్యర్థాల నుంచి ఆదాయం:
వ్యవసాయ రంగంలో వెలువడే వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేలా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే, పరిశ్రమల ఏర్పాటులో ఆధునిక భద్రతా ప్రమాణాలను విస్మరించకూడదని, కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
