కృష్ణా ఫస్ట్ …కడప లాస్ట్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో కృష్ణాజిల్లా ప్రథమస్థానంలో ఉండగా, కడప జిల్లా చివరి స్థానంలో నిలిచిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో ఆయన ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారుగా 10,31,285 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు. మార్చి 1 నుంచి 19 వరకు పరీక్షలు జరిగాయని, గత ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండర్ ఇయర్ రెండు కలిపి ఒకేసారి విడుదల చేయడం మొదలెట్టామని ఆయన చెప్పారు. ఇంటర్ ఫస్టియర్లో రెండో స్థానంలో నెల్లూరు, మూడో స్థానంలో తూర్పుగోదవారి జిల్లా ఉన్నాయి. సెకండియర్లో రెండో స్థానంలో నెల్లూరు, చిత్తూరు, మూడో స్థానంలో గుంటూరు జిల్లాలు నిలిచాయి. ఫస్టియర్, సెకండియర్లో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచిందని అన్నారు. మే 15 అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్లో గ్రేడింగ్ విధానం అమలు చేసే యోచన ఉందని తెలిపారు.
