అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారించారు. తానే రంగంలోకి దిగి బూత్ స్థాయిలో పార్టీని ఇంటింటికి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా వచ్చే నెలలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఏదో ఒక జిల్లాను ఎంచుకొని ఆ జిల్లాలో మూడు రోజులు మకాం వేసి.. సగం రోజు బూత్‌లో పర్యటించి ప్రతి ఇంటికీ వెళ్తారు. మిగతా సగం దినం ఆ గ్రామంలోనే గ్రామస్తులతో సమావేశమవుతారు.
అంతేకాకుండా.. అనుబంధ సంస్థల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ఇలా మూడు రోజులు ఒకే జిల్లాలో గడుపుతారు. దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. 5 వేల మంది పూర్తి స్థాయిలో పనిచేసే కార్యకర్తలను గుర్తించి పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోనున్నారు.
