Israel-Iran War: తగులబడుతున్న పశ్చిమాసియా..!
అమెరికా -ఇజ్రాయెల్ అనుకున్నది ఒకటి.. జరుగుతున్నది మరొకటి. ఖమేనీని చంపేస్తే.. ఇరాన్ దారికొచ్చేస్తుందని వారు భావించారు.అయితే ఇప్పుడు పరిస్థితి మొత్తం తల్లకిందులైనట్లే కనిపిస్తోంది. ఆరెండు దేశాలకు పర్వాలేదు.. ఏమైనా తట్టుకునే సామర్థ్యం ఉంది.కానీ ఇప్పుడు అమెరికా బేస్ లకు స్థానమిచ్చిన ఖతర్, దుబాయ్, బహ్రెయిన్ లాంటి దేశాల పరిస్థితి అగమ్యగోచరమైంది. అవి ఇరాన్ ఆగ్రహజ్వాలలకు సమిధలవుతున్నాయి. తమ దగ్గర ఉన్న మిస్సైల్స్ , డ్రోన్లతో ఆదేశం చేస్తున్న దాడులకు బలవుతున్నాయి. ఈపరిస్థితి ఎక్కడికి దారితీస్తుందా అన్న భయం అందరిలోనూ కనిపిస్తోంది.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ లో సుప్రీంలీడర్ ఖమేనీ చనిపోవడంతో.. ఇరాన్ ప్రతీకారానికి దిగింది. గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపించింది. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4’ పేరుతో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జీసీ) అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై విరుచుకుపడింది. శత్రువులకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది.

అమెరికా బేస్లే లక్ష్యంగా..
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ఐదో దశ దాడులను ముమ్మరం చేసింది. కువైట్‌లోని అబ్దుల్లా ముబారక్ ప్రాంతంలో ఉన్న అమెరికన్ నావల్ బేస్‌పై 4 బాలిస్టిక్ క్షిపణులు, 12 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ధ్వంసమైందని, పలువురు అమెరికన్ సైనికులు మరణించారని సమాచారం. అటు హిందూ మహాసముద్రంలోనూ ఇరాన్ అలజడి సృష్టించింది. అమెరికా నౌకలకు ఇంధనం సరఫరా చేస్తున్న కంబాట్ సపోర్ట్ షిప్‌పై ‘ఖద్ర 380’ క్షిపణులతో దాడి చేసింది.
మరోవైపు, దుబాయ్‌లోని జెబెల్ అలీ యాంకరేజ్‌లో అమెరికాకు ఆయుధాలు చేరవేస్తున్న నౌకపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల తీవ్రతకు దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అంతకుముందు పామ్ ఐలాండ్, బుర్జ్ అల్ అరబ్ ప్రాంతాల్లోనూ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పర్షియన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇరాక్ కుర్దిస్తాన్‌లోని అమెరికా బేస్‌లపై కూడా ఇరాన్ ఎయిర్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది.
ఇవి కూడా చదవండి
శత్రువులకు నరకమే..
తమ నాయకుడి మరణానికి ప్రతీకారంగా ‘చరిత్రలోనే అత్యంత భయంకరమైన అఫెన్సివ్ ఆపరేషన్’ చేపడతామని ఐఆర్ జీసీ హెచ్చరించింది. “శత్రువులకు నరక ద్వారాలు తెరిచి ఉంచుతాం.. ఇమామ్ హంతకులకు కచ్చితంగా శిక్ష పడుతుంది” అని టెలిగ్రామ్ వేదికగా ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కతార్లలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. శత్రువులకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ పరోక్షంగా హెచ్చరించింది.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్ స్పందించారు. తక్షణమే హింసను ఆపాలని, లేదంటే ప్రపంచ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. అటు రష్యా, యూరోపియన్ యూనియన్ కూడా ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరాయి. ఏది ఏమైనా ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పినట్లు కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి

















