US-Iran War: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ… అమెరికా అమ్ములపొదిలో అస్త్రాలివి….!
ఇరాన్ పై యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్(ISRAEL) స్వైరవిహారం చేశాయి. వాటి అత్యాధునిక ఆయుధ సంపత్తి, గూఢచర్య పటిమ ముందు టెహ్రాన్ నిలువలేకపోతోందని చెప్పాలి. ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా ఇప్పటివరకు ఇజ్రాయెల్‌తో కలిసి 2000కు పైగా టార్గెట్లను ధ్వంసం చేసింది. వీటిల్లో అలీ ఖమేనీ కాంపౌండ్, ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం కూడా ఉన్నాయి. 47 ఏళ్లలో 1000 మంది అమెరికన్ల మరణానికి కారణమైన ఐఆర్జీసీని దెబ్బతీశామని అమెరికా సెంట్కామ్ ఎక్స్ వేదికగా పేర్కొంది. ఇప్పుడు ఐఆర్‌జీసీకి ప్రధాన కార్యాలయం కూడా లేదని ఎద్దేవా చేసింది.
ఇరాన్‌పై దాడులకు ఉపయోగించిన ఆయుధాలను, తమ టార్గెట్లను కూడా అమెరికా సెంట్రల్ కమాండ్ బయటపెట్టింది. బి-2 స్టెల్త్ బాంబర్లు, లూకస్ డ్రోన్లు, పేట్రియాట్ క్షిపణులు, థాడ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్, ఎఫ్-18, ఎఫ్-16, ఎఫ్-22 ఫైటర్ జెట్లు, ఎ-10 అటాక్ జెట్స్, ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్స్, ఈఏ-18జీ ఎలక్ట్రానిక్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, అవాక్స్ విమానం, ఎయిర్‌బార్న్ కమ్యూనికేషన్ రిలే, పి-8 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, ఆర్సీ-135 నిఘా విమానం, ఎంక్యూ-9 రీపర్స్, ఎం-142 హైమొబిలిటీ రాకెట్ వ్యవస్థ, అణుశక్తి విమాన వాహక నౌక, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, రీఫ్యూయలింగ్ విమానాలు, రీఫ్యూయలింగ్ షిప్‌లు, సి-17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానం, సి-130 కార్గో విమానం వాడినట్లు తెలిపింది.

అమెరికా దాడిలో బి-2 స్టెల్త్ బాంబర్లను వినియోగించింది. ఇవి వైట్మన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి బయల్దేరి దాడుల అనంతరం టెక్సాస్‌లోని డయిస్ ఎయిర్ బేస్‌కు చేరుకొన్నాయి. ఇక ఇరాన్ సైప్రస్‌లోని తమ స్థావరంపై దాడి చేయడంతో బ్రిటన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సమీపంలో ఉన్న తమ స్థావరం డియాగోగార్సియాను వాడుకొనేందుకు అమెరికాకు తాత్కాలికంగా అనుమతులు ఇచ్చింది. ఇరాన్ క్షిపణి దాడులను నిలువరించేందుకు దీనిని వాడుకోనిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా బి-2 స్టెల్త్ బాంబర్లు ప్రయాణించేందుకు అనువైన రన్‌వే ఇక్కడ ఉంది.

















