Trump: ఇరాన్ యుద్ధం సంక్లిష్టమే.. మరికొన్ని వారాలుపట్టొచ్చన్న ట్రంప్….!
ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మట్టుపెట్టాయి. దీంతో యుద్ధం ముగిసిపోతుందని అగ్రరాజ్యం భావించింది. అయితే ఇప్పుడే వాస్తవ పరిస్థితి అర్థమవుతోంది. ఈ యుద్ధం మరికొన్ని వారాల పాటు సాగే అవకాశముందని అగ్రరాజ్యాధినేత ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని వెల్లడించారు. ఈసందర్భంగా తనపై గతంలో జరిగిన హత్యాయత్నాల ఘటనలను అధ్యక్షుడు (Donald Trump) ప్రస్తావించారు.
‘‘ఖమేనీ ప్రోద్బలంతో నాపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. కానీ, నేను మొదటి ప్రయత్నంలోనే అతడి కథ కంచికి చేర్చా. నన్ను పట్టుకోకముందే నేనే అతడిని పట్టుకొన్నా. ఇరాన్ (War with Iran)పై ఆపరేషన్ క్లిష్టమైనదే.. కానీ విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నాం. అవసరమైతే ఈ ఆపరేషన్ నాలుగు నుంచి ఐదు వారాలు కొనసాగొచ్చు. యుద్ధ తీవ్రతను ఇదేవిధంగా కొనసాగించడం ఇజ్రాయెల్ (Israel), అమెరికాకు కష్టమేమీ కాదు. మరోవైపు, చర్చల కోసం మా దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. అయితే, చర్చలు జరుగుతాయో, లేదో చెప్పలేం’’ అని ట్రంప్ వెల్లడించారు.

ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు అమెరికా (USA)కు చెందిన ముగ్గురు సైనికులు మరణించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. తమ సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. అయితే, యుద్ధం ముగిసేలోపు మరింత ఎక్కువమంది అమెరికా సైనికులు మృతిచెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ దాడుల వల్ల ఇరాన్లో దాదాపు 200 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఖమేనీతో పాటు పలువురు సీనియర్ మిలిటరీ కమాండర్లు, రాజకీయ ప్రముఖులు కూడా మృతి చెందినట్లు సమాచారం.
ఐఆర్ జీసీ దళాలు ఆయుధాలు వీడాల్సిందే..
ఇరాన్ ఐఆర్జీసీ, మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే వారికి రక్షణ కల్పిస్తామని ట్రంప్ వెల్లడించారు. లేదంటే వారికి చావు తప్పదని హెచ్చరించారు. తన ఆఫర్ను వాడుకొని ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ పొందాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, భయంకరమైన మిలిటరీ దాడులను చూస్తున్నామని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఇరాన్ దీర్ఘశ్రేణి అణ్వాయుధాలను కలిగిఉండటం.. అమెరికా భద్రతకు పెనుముప్పు అని పేర్కొన్నారు. దాన్ని అడ్డుకోవడమే కోసమే తాము ఈ దాడులు చేపట్టామన్నారు. తమ లక్ష్యాలన్నీ నెరవేరేవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి

















