H1B Visa: హెచ్1బీ వీసాలు అవసరమే.. ఊహాగానాలకు తెరదించిన ట్రంప్..
Washington: హెచ్1 బీ (H1B Visa) వీసాల విస్తరణపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk), భారతీయ- అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ఈ చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇచ్చారు. దీనిపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతిస్తున్నానని తెలిపారు. తాను ఎల్లప్పుడూ హెచ్1 బీ (H1B Visa)లకు అనుకూలంగా ఉంటానని అన్నారు.
అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE)కి సంయుక్త సారథులుగా నియమితులైన మస్క్, వివేక్ రామస్వామి ఈ విషయంపై మాట్లాడారు. యూఎస్ తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్నందున ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం గలవారిని దేశంలోకి అనుమతించడానికి హెచ్1బీ వీసా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. టాలెంట్ ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటి స్థానంలో ఉండాలంటే ఈ ప్రోగ్రాంకు మద్దతివ్వాలని కోరారు. మస్క్ కూడా హెచ్1బీ వీసా పైనే అమెరికాకు వలస వచ్చారు.
రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ(Nikky) మాట్లాడుతూ తాను సౌత్ కరోలినా గవర్నర్గా పనిచేసిన సమయంలో నిరుద్యోగిత రేటు 11 శాతం నుంచి 4 శాతానికి పడిపోయిందని అన్నారు. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైందని.. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకానీ అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని తన అభిప్రాయాన్ని వినిపించారు.
ప్రత్యేక నిపుణులైన విదేశీయులను మరింత తేలిగ్గా నియమించుకొనేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ బైడెన్ కార్యవర్గం పలు నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతోపాటు సులువుగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసా(H-1B visa)లుగా మార్చుకొనే అవకాశం కల్పించింది. ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది. ఈ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకొంటుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు ఈ వీసా నుంచి చాలా లబ్ధి పొందాయి.






