jagmeet: ట్రూడో సర్కార్ పతనం ఖాయం..!
కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సర్కార్ కుప్పకూలడం తథ్యమా..? మిత్రపక్షం, విపక్షం కలిసి సర్కార్ ను దించేయనున్నాయా…? సర్కార్ ను కాపాడుకునేందుకు ట్రూడో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా..? మొన్నటి వరకూ వెనకేసుకొచ్చిన ఖలిస్తానీమద్దతు దారు నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ అధినేత జగ్మీత్ సింగ్.. సమయం చూసి దెబ్బకొట్టారా..? తమ ప్రయోజనాలు ఒడ్డెక్కించుకున్న జగ్మీత్… పరిస్థితి మరింత దిగజారడంతోనే ఈనిర్ణయం తీసుకున్నారా..? ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తే ఇదే అర్థమవుతుంది.
ట్రూడో లిబరల్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ జగ్మీత్ సింగ్ ఓ లేఖను ఎక్స్ లో పోస్టు చేశారు.
‘జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యారు. ప్రజల కోసం కాకుండా.. శక్తిమంతుల కోసం పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్డీపీ సిద్ధంగా ఉంది. కెనడియన్లకు తమ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశం కల్పిస్తాం. హౌస్ ఆఫ్ కామన్స్ తదుపరి సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తెస్తాం’ అని పేర్కొన్నారు.
ఆ దేశ ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రిలాండ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్లో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపుపొందిన ఆమె.. ప్రధాని ట్రూడో (Trudeau) ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. అయితే, ఆమె నిర్వహిస్తున్న ఆర్థికశాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పిన నేపథ్యంలో క్రిస్టియా(crystia).. తన పదవికి రాజీనామా చేయడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. సరిహద్దులో వలసలు, డ్రగ్స్ అక్రమరవాణాను కట్టడి చేయకుంటే కెనడాపై టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలు అంటించారు. అయినా ఈ విషయాల్లో సరిగా స్పందించడం లేదని సొంత పార్టీ నేతల నుంచే జస్టిన్ ట్రూడో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విశ్వాసతీర్మానంపై ఓటింగ్లో ట్రూడో సర్కారు ఎన్డీపీ మద్దతుతో గట్టెక్కింది. మరోవైపు జగ్మీత్సింగ్ ఖలిస్థానీ వేర్పాటువాదానికి బలమైన మద్దతుదారు అన్న విషయం తెలిసిందే. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే ట్రూడో భారత్తో విభేదాలను పెంచి పెద్దవి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే ట్రూడో పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు బహిరంగంగా పిలుపునిచ్చాయి. మరోవైపు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.






