ASSAD: ముగిసిన అసద్ శకం.. రెబల్స్ ఆధీనంలోకి క్యాపిటల్ డమాస్కస్…
సిరియాలో అంతర్యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. దశాబ్దాల పాటు సిరియాను ఏలిన దేశాధ్యక్షుడు బషర్ అల్- అసద్ కుటుంబంతో సహా దేశం విడిచి పరారయ్యాడు.తిరుగుబాటు దారులు దేశరాజధాని డమాస్కస్ స్వాధీనం చేసుకున్న తరుణంలో… అసద్ దేశం విడచి సురక్షిత ప్రాంతానికి తరలిపోయినట్లు తెలుస్తోంది. అయితే అది ఎక్కడుందన్న అంశంపై క్లారిటీ లేదు. మరోవైపు.. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. హయాత్ తహరీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌పై పట్టు బిగించిన నేపథ్యంలో అసద్ కుటుంబంతో సహా నగరాన్ని వీడి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న ఐఎల్-76 విమానం ఎత్తు ఒక్కసారిగా 3,650 మీటర్ల నుంచి 1,070 మీటర్లకు పడిపోయిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ల సమాచారం చెబుతున్నట్లు ఈజిప్ట్ రచయిత ఖలీద్ మహమూద్ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రదేశం లెబనాన్ గగనతలం పరిధిలో ఉంది. ఎవరైనా దీనిని కూల్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఈ విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సిరియా అంతర్యుద్ధానికి సంబంధించి శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఉత్తర సిరియాపై హయాత్ తహరీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు పట్టుబిగిస్తోంటే, దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసద్ వ్యతిరేకంగా మారింది. కీలక నగరం దారా కూడా తిరుగుబాటుదారుల వశమైంది. 2011లో అసద్‌కు వ్యతిరేకంగా ఉద్యమం ఈ నగరం నుంచే ప్రారంభమైంది. తర్వాత అది అంతర్యుద్ధంగా మారింది. దారాలోని 90శాతం భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దారాకు 50 కిలోమీటర్ల దూరంలోని సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయినట్లు తెలుస్తోంది.
ఈసారి అండ లేదు
పదమూడేళ్ల అంతర్యుద్ధంలో అసద్ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించిన రష్యా, ఇరాన్‌ల నుంచి ఈసారి డమాస్కస్‌కు సాయం అంతంతమాత్రంగానే లభిస్తోంది. రష్యా పరిమిత స్థాయిలోనే వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇవి తిరుగుబాటుదారులపై అంతగా ప్రభావం చూపడం లేదు. ఇరాన్ పరిస్థితి కూడా మాస్కో తరహాలోనే ఉంది.
సిరియాను తక్షణం వీడండి: భారత్
సిరియాకు భారత పౌరులెవరూ ప్రయాణించొద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. సిరియాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆ దేశాన్ని వీడాలనుకొనేవారు తక్షణమే అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించింది.. సిరియా అల్లకల్లోలంగా ఉందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. సిరియా సంక్షోభంలో తమ పాత్ర లేదని చెప్పారు.






