Yoon Suk Yeol: ఓవైపు అరెస్ట్ గండం..మరోవైపు పదవికి ముప్పు.. పీకల్లోతు చిక్కుల్లో దక్షిణకొరియా అధ్యక్షుడు
అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) ఎమర్జెన్సీ వివాదం దక్షిణకొరియాలో పొలిటికల్ టెన్షన్ ను పీక్స్ కు చేర్చింది. మార్షల్ లా(Martial Law) విధించిన యోల్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు.. ఆయనను అరెస్ట్ చేస్తామని, అందుకోసం కోర్టు నుంచి దర్యాప్తు అధికారులు అంగీకార పత్రం తెచ్చుకున్నారు. ఇక..తన నివాసం ఎదుట భారీగా హాజరైన మద్దతుదారులను ఉద్దేశించి యోల్.. కీలక ప్రకటన చేశారు. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి దేశాన్ని ప్రమాదంలో పడేసేందుకు పనిచేస్తున్న శక్తులపై చివరివరకు పోరాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
యూన్ సుక్ యోల్(Yoon Suk Yeol) మార్షల్ లా ప్రకటించడం పైనా దర్యాప్తు కొనసాగుతోంది. న్యాయవాదులతో పాటు పోలీసు, రక్షణ మంత్రిత్వశాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన జాయింట్ టీమ్ అధ్యక్షుడిని విచారిస్తోంది. కాగా మూడుసార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్ వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అంగీకరించింది.
జనవరి 6లోపు యూన్ సుక్ యోల్‌ను అరెస్టు చేస్తామని దర్యాప్తు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు యూన్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన తరఫు న్యాయబృందం హెచ్చరించింది.
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ (Emergency Martial Law) విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రకటనను విరమించుకున్నప్పటికీ.. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు.
మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను, విధులను ప్రధానమంత్రి హన్ డక్ సూకీకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్‌ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. కాగా యూన్ సైతం దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు.






