Kyiv: కీవ్ డ్రోన్స్ వేట.. పిట్టల్లా రాలిపోతున్న ఉత్తరకొరియా సైనికులు…
North korea soldiers: భాష తెలియదు.. స్థానికపరిస్థితులపై అవగాహన లేదు. అధ్యక్షుడు ఆదేశించారు అంతే.. ఉన్న పళంగా 10 వేల మందితో కూడిన సైన్యం.. యుద్ధరంగంలో అడుగు పెట్టింది. కుర్క్స్ పరిసర గ్రామాల్లో ఉక్రెయిన్ సైనికులు రాకుండా కాపలా కాస్తున్నాయి ప్యాంగ్ యాంగ్ దళాలు. అయితే పశ్చిమదేశాలు అందిస్తున్న ఆయుధ సహకారంతో పటిష్టంగా ఫైట్ చేస్తున్న కీవ్.. సమయం చూసి దెబ్బేసింది. ఉక్రెయిన్ తో పోరాటమంటే మృత్యువే గతన్న సంగతి యుద్ధరంగంలో నేలకొరిగిన సైన్యానికి ఆలస్యంగా అర్ధమైంది. అప్పటికే వారు ప్రాణాలు సైతం కోల్పోయారు.
ఉక్రెయిన్‌పై జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధక్షేత్రంలో దిగిన ఉత్తరకొరియా సైన్యానికి.. యుద్ధరంగంలో పోరాటమెలా ఉంటుందో తెలిసొచ్చింది.శత్రువు కదలికలపై పక్కా సమాచారంతో దాడులకుదిగుతున్న కీవ్ సైన్యం.. కిమ్ సైనికులపైకి డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్లు ఒక్కసారిగా విరుచుకుపడడంతో.. కొరియా సైనికులు తొలుత కాల్చేందుకు ప్రయత్నించారు. తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఇది ఆధునిక యుద్ధక్షేత్రం కావడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
తమ డ్రోన్లు గద్దల్లా వేటాడడంతో పోరులో కిమ్ సైనికులు భారీ సంఖ్యలో మరణించడం లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(zelensky) ప్రకటించారు. తాజాగా దాన్ని రుజువు చేసేలా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో ఉక్రెయిన్ (Ukraine) ప్రయోగించిన డ్రోన్ల (Drones)ను ఎదుర్కోలేక కిమ్ (Kim Jong Un) జవాన్లు పరుగులు పెట్టినట్లుగా ఉంది.కీవ్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. రష్యా (Russia)లోని కుర్స్క్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన ఉత్తర కొరియా (North Korea) జవాన్లను కమికేజ్ డ్రోన్లను వేటాడాయి. గత మూడు రోజుల్లో ఈ డ్రోన్లు 77 మంది కొరియన్ సైనికులను చంపేసినట్లు పేర్కొన్నాయి. అయితే, దీనిపై అటు రష్యా గానీ..ఇటు కిమ్ ప్రభుత్వం గానీ ఇంతవరకూ స్పందించలేదు.
ఉక్రెయిన్ చొరబాటును అరికట్టేందుకు ప్రయత్నిస్తోన్న రష్యా (Russia).. సరిహద్దు ప్రాంతమైన కుర్స్క్లో భారీస్థాయిలో సైన్యాన్ని మోహరించింది. ఇందులోభాగంగా మూడు గ్రామాల్లో దాదాపు 10వేల మంది కిమ్ సైనికులు పోరాడుతున్నారు. తొలుత వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించిన అనంతరం కదన రంగంలోకి దింపారు. అయినప్పటికీ భాష సమస్య కారణంగా మాస్కో, కొరియన్ సేనల మధ్య సమన్వయం లోపించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కథనాలు వచ్చాయి. తొలి వారాల్లోనే ప్రతి పది మంది కిమ్ సైనికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని దక్షిణ కొరియా తెలిపింది. యుద్ధంలో పోరాడే శక్తి కిమ్ దళాలకు లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోందని అమెరికా సైతం అభిప్రాయం వ్యక్తంచేసింది.






