Bangladesh: చరిత్రను మార్చేస్తున్న బంగ్లా సర్కార్.. బంగబంధు చరిత్ర తెరమరుగే..?
బంగ్లాదేశ్ నూతన సర్కార్… ఒకొక్కటిగా షేక్ హసీనా(shiek hasina) కుటుంబ ప్రాధాన్యతను తెరమరుగు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టిన అక్కడి అతివాదులు.. ఇప్పుడు ఆమె కుటుంబ ఘనచరితను కూడా మాయం చేసే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా తర్వాతి తరాలకు.. ముజిబుర్ రెహ్మాన్(mujibur rehman) పోరాటం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ దేశ పాఠ్యపుస్తకాల్లో బంగబంధు ముజిబుర్ రహ్మాన్ ప్రాధాన్యం తగ్గించేలా సవరణలు చేపట్టారు.
1971 బంగ్లా లిబరేషన్ వార్ సందర్భంగా స్వాతంత్ర ప్రకటన తొలిసారిగా మేజర్ జియావుర్ రహ్మాన్ చేసినట్లు మార్పులు చేశారు. గతంలో ఈ ప్రకటన షేక్ ముజిబుర్ రెహ్మాన్ చేసినట్లు ఉండేది. అంతేకాదు.. పాఠ్యపుస్తకాల్లో చాలా మార్పులు చేశారని అక్కడి పత్రికలు చెబుతున్నాయి.ఈమార్పులతో కూడిన పుస్తకాలను జనవరి 1 నుంచి ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో పంపిణీ చేయడం మొదలుపెట్టారు.
ఈ పరిణామాలపై నేషనల్ కరికులమ్ టెక్స్ట్ బుక్ బోర్డ్ ప్రొఫెసర్ ఏకేఎం రియాజుల్ హుస్సేన్ స్పందిస్తూ.. కొత్త పుస్తకాలు 2025 కోసం సిద్ధం చేశామని చెప్పారు. 1971 మార్చి 26న జియావుర్ రహ్మాన్ స్వాతంత్ర ప్రకటన చేశారని.. మార్చి 27న ఆయనే బంగబంధు ముజిబుర్ రెహ్మాన్ తరఫున కూడా ఇలాంటి ప్రకటనే వెలువరించినట్లు మార్చారన్నారు. ఉచిత టెక్స్ట్‌బుక్స్‌లో ఈ విషయాన్ని పొందుపర్చినట్లు చెప్పారు. పరిశోధకుడు రఖల్ రహా దీనికి సంబంధించిన సమాచారాన్ని సమకూర్చారన్నారు.
గతంలో ముజిబుర్ రహ్మాన్ గురించి అతిశయోక్తులు, బలవంతంగా రుద్దిన చరిత్ర ఉందని పేర్కొన్నారు రియాజుల్ హుస్సేన్.. ‘‘పాక్ ఆర్మీ వద్ద బందీగా ఉన్న సమయంలో షేక్ ముజిబుర్ రెహ్మాన్ వైర్లెస్ సెట్ ద్వారా స్వాతంత్ర ప్రకటన చేసినట్లు పేర్కొనడంలో వాస్తవాలు లేవు. అందుకే దానిని మార్చాము’’ అని వెల్లడించారు. అంతేకాదు.. జాతిపితగా(banga bandhu) కూడా ముజిబుర్ రహ్మాన్ పేరును తొలగించారు.
గతంలో 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో పాలక ప్రభుత్వాన్ని బట్టి స్వాతంత్ర ప్రకటన అంశంలో మార్పులు చోటుచేసుకొన్నాయి. అవామీ లీగ్ మద్దతుదారులు మాత్రం ముజిబుర్ రహ్మాన్ నాటి మేజర్ జియావుర్ రహ్మాన్‌తో(Ziaur rehman) కలిసి ఈ ప్రకటన చేసినట్లు బలంగా నమ్ముతారు. ముజిబ్ ఆదేశాల మేరకు జియావుర్ ప్రకటన చదివినట్లు చెబుతారు. కానీ, బీఎన్పీ పార్టీ మాత్రం జియావుర్ స్వయంగా ఈ ప్రకటన చేసినట్లు చెబుతుంది.






