Yunus: పాకిస్తాన్ తో నెయ్యం.. భారత్ తో కయ్యం..!
పొరుగున ఉన్న భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతోంది బంగ్లాదేశ్. వరుసగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అకృత్యాలు కొనసాగిస్తూ, భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తన సరిహద్దుల్లో బైరెక్టర్ డ్రోన్లను(BIRECTOR DRONES) మోహరించింది. బంగ్లాదేశ్ సరిహద్దును దాటి ఆ దేశ బోర్డర్ గార్డ్స్ అస్సాంలోకి చొరబడ్డారు(BORDER CROSSING). సరిహద్దుల్లో నిర్మితమవుతున్న ఆలయ నిర్మాణాన్ని ఆపేయాలంటూ, లేకుంటే కాల్పులు జరుపుతామంటూ హెచ్చరించారు. ఈ చర్యతో అంతర్జాతీయ చట్టాలను బంగ్లాదేశ్ సరిహద్దు దళం ఉల్లంఘించింది.
మరోవైపు…బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బంగ్లాలో తమ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ని కాదని మహ్మద్ అలీ జిన్నా(JINNAH)ను పొగుడుతున్నారు. తాజాగా రెండు దేశాల మధ్య బంధం మరింతగా పెరిగేందుకు ..బంగ్లాదేశ్, పాకిస్తాన్ పౌరులకు వీసా (VISA)నిబంధనల్ని సడలించింది. పాకిస్తాన్ పౌరులుకు భద్రతా క్లియరెన్స్ పొందాల్సిన అవసరాన్ని తొలగించింది. 2019లో ఈ క్లియరెన్స్‌ని ప్రవేశపెట్టారు. డిసెంబర్ 2న బంగ్లా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ డివిజన్(ఎస్ఎస్డీ) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి, పరిమితుల్ని తొలగించింది. ఈ పరిణామం రానున్న కాలంలో భారత్‌కి భద్రతా పరమైన సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమీషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ డిసెంబర్ 3న ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నాయకురాలు ఖలీదా జియా(KHALIDA JIYA)తో సమావేశానికి ఒక రోజు ముందు ఈ నిర్ణయం వెలువడింది. గత నెలలో తొలిసారిగా కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్‌కి పాకిస్తాన్ నుంచి కార్గో నౌక వచ్చింది. ఇప్పుడు పాకిస్తానీలకు వీసా నిబంధనల్లో సడలింపుల్ని ఇచ్చింది. ఖలీదా జియా, మాజీ ప్రధాని షేక్ హసీనాలా కాకుండా పాకిస్తాన్‌తో సంబంధాలను కలిగి ఉండి. షేక్ హసీనా సమయంలో భారత్‌కి మంచి మిత్రురాలిగా ఉండేది. ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం జమాతే ఇస్లామీ, బీఎన్పీలే పాలన సాగిస్తున్నారు. ఈ రెండు కూడా పాకిస్తాన్ అనుకూల పార్టీలుగా పేరు పొందాయి.






