ఎన్నారైలకు అలర్ట్… చెల్లుబాటయ్యే H1B VISA లేదని వెనక్కు పంపుతున్న లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్
H1B VISA స్టాంప్ లేదా..? అయితే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే మరి. ఇప్పటివరకూ ఏదోలా గడిచిపోయినా ఇకముందు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో San Francisco నుండి భారతదేశానికి ప్రయాణించే చాలా మంది హెచ్ 1 బి వీసాదారులు.. చెల్లుబాటయ్యే హెచ్-1బి వీసా లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. I-797A అప్రూవల్ నోటీస్ వంటి అవసరమైన పత్రాలు ఉన్నప్పటికీ పాస్ పోర్టులపై చెల్లుబాటు అయ్యే హెచ్ 1బీ వీసా స్టాంప్ లేని ప్రయాణికులను లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ వెనక్కి పంపుతోంది.
ముఖ్యంగా హెచ్1బీ స్టాంపింగ్ కోసం భారత్ కు వెళ్లే వారు .. ఏం చేయాలో తెలియనిస్థితిలో ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. ముఖ్యంగా స్టాంపింగ్ కోసం భారతదేశానికి వెళ్తున్న లేదా గడువు ముగిసిన వీసా కలిగి ఉండి, సరైన పేపర్ వర్క్ కలిగి ఉన్న ప్రయాణీకులపై ఈ విధానం తీవ్రప్రభావం చూపిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (SFO) లోని లుఫ్తాన్సా సిబ్బంది చెల్లుబాటు అయ్యే హెచ్ 1 బి వీసా స్టాంప్ లేనందున బోర్డింగ్ నిరాకరించారని పలువురు వాపోయారు. దీంతో .. ఇది తాత్కాలిక నిర్ణయమా లేక కొత్త విమానయాన విధానమా అని ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు.
వీసా ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుండడంతో .. చాలా మందికి ఇది ఇబ్బందికరంగా అనిపిస్తోంది. అసంపూర్ణంగా ఉన్న వీసా డాక్యుమెంటేషన్ తో విదేశాలకు వెళ్లడం కరెక్టు కాకున్నా.. అకస్మాత్తుగా ఇలాంటి సంక్లిష్టతలు తలెత్తడం.. ఎన్నారైలకు ఇబ్బందికరంగా మారింది. ప్రయాణికుల ఆందోళన తొలగించేందుకు లుఫ్తాన్సా ఎయిర్ పోర్టు.. తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటే.. ఈతరహా సమస్యలు తలెత్తవని చెబుతున్నారు.
విమానయాన సంస్థ మరియు యుఎస్ కాన్సులర్(US CONSULAR) .. వీటికి తగిన పరిష్కారం చూపించాల్సిఉంది.. ట్రావెల్ పాలసీలో ఏవైనా మార్పులు ఉంటే ప్రయాణికులకు ముందుగానే తెలియజేయాలి, ముఖ్యంగా వీసా వంటి క్లిష్టమైన విషయం ఉన్నప్పుడు. లుఫ్తాన్సా వంటి విమానయాన సంస్థలు.. సరైన డాక్యుమెంట్లు లేని ప్రయాణికులకు జరిమానా విధించకుండా చూడాల్సిన పరిస్థితి ఉందని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు.






