Turkey: పాక్ ప్రధానికి దౌత్యమర్యాదలు తెలియవా..?
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాద్ షరీఫ్ ప్రవర్తన.. అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటోంది. అనుమతి లేకుండా ఓ దేశ అధ్యక్షుడు.. మరో దేశాధ్యక్షుడితో సమావేశమైన సమయంలో.. చెప్పా, పెట్టకుండా లోపలకు అడుగుపెట్టడం మర్యాద కాదన్న సంగతిని ఆయన మరిచారు. కాస్త ఆలస్యమైందన్న కారణంలో.. లోపలకు వెళ్లి.. ఆ ఇద్దరు దేశాధినేతలకు షాకిచ్చారు..
తుర్క్మెనిస్థాన్ శాశ్వత తటస్థతకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా …ఆ దేశంలో ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశం కావాల్సి ఉంది. అయితే, షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ భేటీ ఆలస్యమైంది. దీంతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో కలిసి పక్క గదిలో దాదాపు 40 నిమిషాల పాటు షెహబాజ్ షరీఫ్ నిరీక్షించారు.
సమయం గడుస్తున్నా పుతిన్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో షెహబాజ్ షరీఫ్ అసహనానికి గురయ్యారు. ఇక వేచి ఉండటంలో లాభం లేదనుకుని, కనీసం ఒక్కసారైనా పలకరించాలనే ఉద్దేశంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో వ్లాదిమిర్ పుతిన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో ఒక గదిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య తీవ్రమైన చర్చ జరుగుతుండగా, షెహబాజ్ షరీఫ్ అనూహ్యంగా ఆ గదిలోకి ప్రవేశించారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అలా లోపలికి వెళ్లిన ఆయన, దాదాపు 10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.
ఈ ఘటన మొత్తం కెమెరాల్లో రికార్డ్ కావడంతో, అది కాస్తా బయటకు పొక్కింది. ఇది పాకిస్థాన్ చేసిన పెద్ద దౌత్యపరమైన తప్పిదమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. “అడుక్కునే వాళ్లతో మాట్లాడి పుతిన్ తన సమయాన్ని వృథా చేసుకోరు” అని ఒకరు కామెంట్ చేయగా, “గతంలో ట్రంప్ కూడా వీరితో ఇలాగే ప్రవర్తించారు” అని మరొకరు ఎగతాళి చేశారు.






