Panchayath Elections: ఏపీలో ముందస్తు పంచాయతీ ఎన్నికల కసరత్తు..త్వరలో షెడ్యూల్ ప్రకటన..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే తొలి దశ పోలింగ్ పూర్తైంది. మరో రెండు దశల్లో ఈ నెలలోనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ హడావుడి పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూడా పంచాయతీ ఎన్నికల సందడి మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో ప్రస్తుతం ఉన్న పంచాయతీ పాలకవర్గాల పదవీకాలానికి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు గడువు ఉన్నా, ప్రభుత్వం ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో సెప్టెంబరు నుంచే అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇటీవల ఎన్నికల సంఘం (State Election Commission) కీలక సమావేశం నిర్వహించి పంచాయతీ ఎన్నికలపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేసి, ఎన్నికల పోరుకు సిద్ధం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలనే దృఢమైన ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జనగణన కార్యక్రమం ఉండటంతో, ఆ లోపు ఎన్నికలు పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సమాచారం. దీనికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఇప్పటికే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిందని, ఓటర్ల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు.
ఈసారి పంచాయతీ ఎన్నికలను ఈవీఎం విధానంలో నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. ఇప్పటివరకు గ్రామ స్థాయి ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఈసారి నాలుగు విడతల్లో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తే పారదర్శకత పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనిపై ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉందని తెలుస్తోంది.
అన్ని ముందస్తు ఏర్పాట్లు దాదాపుగా పూర్తవడంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన మాత్రమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు. జనవరిలో పండుగల కారణంగా 20వ తేదీ తర్వాత పోలింగ్‌కు వెళ్లే అవకాశముందని చర్చ సాగుతోంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 మధ్య ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేసిందని సమాచారం. ఆ కాలంలో వాతావరణం అనుకూలంగా ఉండటం, విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఉండటం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
ఈ ఆలోచనలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. అందువల్ల వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షెడ్యూల్‌కు ముందుగా కొన్ని పంచాయతీల విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు, కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసే అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే సమయం తక్కువగా ఉండటంతో కొత్తగా ఏర్పడే పంచాయతీలకు వెంటనే ఎన్నికలు జరుగుతాయా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఏదేమైనా, ఎన్నికల సంఘం వేగాన్ని చూస్తే త్వరలోనే ఏపీలో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.






