Amaravati : అమరావతికి చట్టబద్ధత.. కేంద్రం వెనుకడుగు వేసిందా?
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాలన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలకు ఆరంభంలోనే చిన్నపాటి బ్రేక్ పడింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పాస్ అవుతుందని, ఇక అమరావతిని ఎవరూ కదిలించలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు బలంగా విశ్వసించారు. అయితే, చివరి నిమిషంలో కేంద్ర హోంశాఖ లేవనెత్తిన సాంకేతిక అభ్యంతరాలు ఈ ప్రక్రియను బడ్జెట్ సమావేశాల వరకు వాయిదా వేసేలా చేశాయి. అసలు కేంద్రం అడిగిన క్లారిటీ ఏంటి? దీని వెనుక ఉన్న రాజకీయం ఏంటి?
2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని పక్కన పెట్టింది. దీంతో భూములిచ్చిన రైతులు రోడ్డెక్కాల్సి వచ్చింది. ఐదేళ్ల పాటు సాగిన ఈ అనిశ్చితి, న్యాయ పోరాటాల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చకుండా, అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచేలా పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కోరుతూ పంపిన ముసాయిదాలో.. రాష్ట్రం విడిపోయిన “2014 జూన్ 2 నుంచే అమరావతిని రాజధానిగా గుర్తించాలి” అని కోరినట్లు సమాచారం. ఇక్కడే కేంద్ర హోంశాఖకు సాంకేతిక చిక్కు ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం.. విభజన జరిగిన నాటి నుంచి పదేళ్ల పాటు అంటే 2014 నుంచి 2024 జూన్ వరకు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. చట్టప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న కాలానికి, అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించడం న్యాయపరంగా చెల్లుబాటు కాదు. రెండు చట్టాలు పరస్పరం విరుద్ధంగా మారుతాయి. అందుకే, 2014 నుంచి కాకుండా.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన తర్వాత, అంటే “2024 జూన్ నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ” సవరణలు చేయాలని కేంద్రం సూచించింది. అందుకే ఆ ఫైల్ ను వెనక్కి పంపి, వివరణ కోరింది.
కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. 2024 జూన్ తర్వాతి నుంచి అమరావతికి చట్టబద్ధత కల్పించేలా సవరణలు చేసి మళ్ళీ ఢిల్లీకి పంపనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి ప్రస్తుత శీతాకాల సమావేశాల గడువు ముగిసిపోయే అవకాశం ఉంది కాబట్టి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఈ జాప్యాన్ని ప్రతిపక్షం వైసీపీ అస్త్రంగా మలుచుకుంది. అమరావతిని రాజధానిగా గుర్తించడానికి కేంద్రం సిద్ధంగా లేదని, చంద్రబాబును కేంద్రం నమ్మడం లేదంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. నిధుల విషయంలోనూ, చట్టబద్ధత విషయంలోనూ కేంద్రం ముఖం చాటేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది. అయితే, ఈ విమర్శలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం సాంకేతికపరమైన సవరణ మాత్రమేనని, కేంద్రం అమరావతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు రుణం విషయంలో కేంద్రం గ్యారంటీ ఇవ్వడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. “ఆరునూరైనా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది, జగన్ కుట్రలు సాగవు” అని పెమ్మసాని తేల్చిచెప్పారు.
కేంద్రం లేవనెత్తిన అభ్యంతరం పూర్తిగా సాంకేతికమైనదే తప్ప, రాజకీయపరమైనది కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. విభజన చట్టంలోని నిబంధనలను గౌరవించకుండా కొత్త చట్టం తెస్తే, భవిష్యత్తులో అది కోర్టులో వీగిపోయే ప్రమాదం ఉంది. అందుకే కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే, ప్రజల్లో ఉన్న ఆతృతను, విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలంటే.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కచ్చితంగా ఈ బిల్లును ఆమోదింపజేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపై ఉంది. అప్పటివరకు ఈ రాజకీయ రగడ కొనసాగే అవకాశమే కనిపిస్తోంది.






