US: హెచ్ 1బీ వీసా పెంపుపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత.. కోర్టులో దావా వేసిన 20 రాష్ట్రాలు..!
హెచ్-1బీ వీసా(H-1B Visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయాన్ని … అమెరికాలోని పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా 20 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి. ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని వాదించాయి.
హెచ్-1బీ వీసా ఫీజును పెంచడాన్ని గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. తాజాగా 20 రాష్ట్రాలు వేసిన దావాకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా నాయకత్వం వహించారు. ట్రంప్ నిర్ణయించిన రుసుము నిలిపివేయాలని ఈ దావాలో పేర్కొన్నారు. వలసల చట్టంతో సహా దాని సంబంధిత ఖర్చులలో ఇలాంటి కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వాదించారు.
హెచ్-1బీ వీసాలపై అదనపు రుసుములు విధించే అధికారం ట్రంప్‌నకు లేదని పేర్కొన్నారు అటార్నీ జనరల్ రాబ్ బోంటా. ‘కాంగ్రెస్ ఈ వీసా కార్యక్రమాన్ని మెరుగుపరిచింది. పరిమితులు, రుసుములు నిర్ణయించింది. అదనపు ఛార్జీలు విధించే అధికారం ఆయనకు లేదు. ఏ అధ్యక్ష పరిపాలన ఇమిగ్రేషన్ చట్టాన్ని తిరగరాయదు. రాజ్యాంగాన్ని, చట్టాలను ఏ అధ్యక్షుడు విస్మరించరు’ అని అన్నారు.
ఈ రుసుము ప్రభుత్వం, ప్రైవేటు యజమానులపైనా ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కీలక రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన హెచ్-1బీ వీసాదారుల కొరత ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది మరింత తీవ్రతరం అవుతుందన్నారు బోంటా.
ఇక, భారత దిగుమతులపై ట్రంప్ ఇటీవల 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానం తీసుకొచ్చారు. ఈ సుంకాలు చట్టవిరుద్ధమైనవని, వీటి వల్ల అమెరికన్లకే ఎక్కువగా నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.






