Israel: ఇరాన్ ను బలహీన పరుస్తున్న ఇజ్రాయెల్.. పక్కాగా సహకరిస్తున్న అమెరికా..
పశ్చిమాసియాలో ఇరాన్(iran) బలీయమైన శక్తిగా ఉండేది. ఇరాక్ ఎప్పుడైతే వీకైందో ఇక ఇరాన్ దే పైచేయిగా మారింది. దీంతో ఉగ్రవాదశక్తులు, కిరాయిమూకలకు ఇరాన్ స్పాన్సరర్ గా వ్యవహరించింది. వాటితో ప్రత్యర్థులపై దాడులు చేయిస్తూ.. ఆనందం పొందేది. అయితే ఈసారి ఆ వ్యూహాల్ని ఇజ్రాయెల్ పారనీయలేదు. గాజాతో మొదలుపెట్టి లెబనాన్(Gaza to lebanon) వరకూ వరుస దాడులతో హడలెత్తిస్తోంది. ఇరాన్ ముసుగు సంస్థలుగా ఉన్న లేదా మద్దతుతో నడుస్తున్న హమాస్, హెజ్ బొల్లా(Hezbollah) వెన్నువిరిచింది. ఇంకేముంది.. ఇప్పుడు ఇజ్రాయెల్ పేరు చెబితేనే ఈసంస్థల అధినేతల వెన్నులో భయం పుడుతోంది.
ఎంతలా అంటే హమాస్ అధినేతలుగా ఉన్నవారిని, వారి తర్వాత వినిపించే పేర్లను కాలగర్భంలో కలిపేసింది ఇజ్రాయెల్… అంతేకాదు.. మా బలం చూడు.. మేమొచ్చామో నీపని అయినట్లే అంటూ సుదీర్ఘకాలంగా హెచ్చరిస్తూ.. చెవిలో జోరీగల మారిన హెజ్ బొల్లాకు గట్టి షాకిచ్చింది. ఇజ్రాయెల్ అత్యాధునిక వ్యూహాలముందు కాలం చెల్లిన వ్యూహాలతో పోరాడిన హెజ్ బొల్లా ఇప్పుడు చతికిల పడింది. ఆ సంస్థ అధినేతలను లేపేసింది ఇజ్రాయెల్. ఇంతలా జరుగుతున్న ఇరాన్ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన పరిస్థితి.
ఇప్పుడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్(Israel) ప్రాభవం మరింత ఇనుమడించింది. ఇన్నాళ్లు కాస్తో, కూస్తో బలంగాఉన్న ఇరాన్ లాంటి దేశాలు .. ఇప్పుడు కిక్కురుమనలేని పరిస్థితి. ఎప్పుడు ఎటు నుంచి మొస్సాద్ దాడి చేస్తుందో.. తమ అధినేతల ప్రాణాలు ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించాల్సిన దుస్థితికి ఆయా గ్రూపులను నెట్టేసింది మొస్సాద్. ముఖ్యంగా తమతో పెట్టుకుంటే ఇక అంతే అన్న విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ..ఆయా దేశాలకు, గ్రూపులకు అర్థమయ్యేలా చేశారు.
పోనీ పక్కనే ఉన్న ఇస్లామిక్ దేశాలను ఏకతాటిపైకి తెద్దామంటే.. ప్రస్తుతం యుద్ధంలో ఉన్న దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఆయా దేశాలు కళ్లతో చూస్తున్నాయి.చూస్తూ.. చూస్తూ అలాంటి పరిస్థితిని తెచ్చుకునే సాహసం చేయగలుగుతాయా..? మాకెందుకీ తంటా అని సౌదీ లాంటి దేశాలు అమెరికాతో స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో ఇరాన్ పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది. ఇక అణ్వాయుధ పరీక్షలు నిర్వహించడమో, అణుబాంబులు తయారు చేయడమో తప్ప, ఆదేశం చేసేది ఏమీ లేదని నిరూపితమైంది. అవును మరి.. కొన్ని సమస్యలకు కాలమే తగిన పరిష్కారం చూపిస్తుంది మరి.






