Tehron: అమెరికాకు ఇరాన్ వార్నింగ్..
హమాస్, హెజ్బొల్లా, ఇస్లామిక్ జిహాద్‌లు తమ ముసుగు సంస్థలు కావని.. అవి స్వచ్ఛందంగా పోరాటాలు చేస్తున్నాయని ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ స్పష్టం చేశారు. తాము నేరుగా రంగంలోకి దిగితే అసలు అలాంటి సంస్థల అవసరమే లేదని.. ఒంటరిగానే పోరాడగలమని పేర్కొన్నారు. ‘‘ఇస్లామిక్ రిపబ్లిక్కు (Iran)కు ఎలాంటి ముసుగు సంస్థల అవసరం లేదు. హెజ్బొల్లాను విశ్వాసం, శక్తే ఇందులోకి తీసుకొచ్చింది. ఇక హమాస్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలు వాటి బలమైన నమ్మకంతోనే పోరాడుతున్నాయి. అవి మా ముసుగు సంస్థలు వలే పనిచేయడం లేదు.
చాలామంది ఈ ప్రాంతంలో మేము మా పరోక్ష పోరాట సంస్థలను కోల్పోయినట్లు చెబుతున్నారు. అది తప్పు. ఒకరోజు మేము చర్యలు తీసుకోవడం మొదలుపెడితే మాకు పరోక్ష సంస్థల అవసరం లేదు’’ అని ఖమేనీ వెల్లడించారు.
ఈనెల మొదట్లో సిరియా(SYRIA)లోని రెబల్స్ మెరుపుదాడులు చేసి ఇరాన్‌కు సన్నిహితుడైన అధ్యక్షుడు బషర్‌అల్ అసద్(asad govenment) ప్రభుత్వాన్ని కూల్చేశారు. వీరు డమాస్కస్‌ను స్వాధీనం చేసుకొన్నారు. వీరితో నేరుగా అమెరికా చర్చలు జరుపుతోంది. హయాత్ తహరీర్ అల్-షామ్ (HTS) సహా ఇతర గ్రూపులతో తమ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు ఇప్పటికే వాషింగ్టన్ ప్రకటించింది. సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయిన తర్వాత అమెరికా దౌత్యవేత్తలు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. సిరియాతో పశ్చిమ దేశాలు క్రమంగా సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యం నెలకొంది.
మరోవైపు పాలస్తీనా, లెబనాన్‌కు కీలక ఆయుధాలు సరఫరా చేసే మార్గమైన సిరియాపై పట్టు కోల్పోవడంతో హెజ్బొల్లా, హమాస్, ఇస్లామిక్ జిహాద్ వంటి సంస్థలకు ఇరాన్ నుంచి సాయం అందడం కష్టమైపోయింది. తాజాగా ఖమేనీ సిరియాపై కూడా స్పందిస్తూ అక్కడి యువత కొత్త గ్రూపు పాలనపై సంతృప్తిగా లేదని పేర్కొన్నారు. అమెరికాకు కిరాయి మూకగా పనిచేసే ఏ గ్రూపునైనా తాము కాళ్లకింద వేసి తొక్కి నలిపేస్తామని ఆయన హెచ్చరించారు.






