Trump: భారత్ కు ట్రంప్ మాస్ వార్నింగ్.. వందశాతం ట్యాక్స్ వేస్తే ఊరుకోం..
అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్(Trump) .. అప్పుడే బిజినెస్ మొదలు పెట్టేశారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. వాణిజ్య లెక్కలను సరిచేస్తున్నారు. ఇప్పటికే పొరుగుదేశాలైన మెక్సికో , కెనడాలకు మాస్ వార్నింగిచ్చేశారు. సరిహద్దుల దగ్గర వలసలు, డ్రగ్స్ ఇతర అంశాలను కట్టడి చేయకుంటే 25 శాతం ట్యాక్స్ విధిస్తానని గట్టిగానే చెప్పారు. అయితే ఆయన వార్నింగ్స్ అక్కడితో ఆగలేదు. చైనా(China), భారత్ (India)కు ఇదే రీతిలో వార్నింగిచ్చారు ట్రంప్.
మరీ ముఖ్యంగా ఇండియా అనుసరిస్తున్న విధానాన్ని ట్రంప్ తప్పు పట్టారు. అమెరికా నుంచి వస్తున్న వస్తువులకు ఇండియా ఏకంగా వందశాతం పన్నువేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో ఇండియా వైఖరి మారకుంటే.. ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై తాము కూడా 100 శాతం పన్నువేస్తామన్నారు. ఆదేశానికి ఈ దేశం ఎంతదూరమో.. ఇక్కడికి ఆదేశం అంతే దూరమన్నారు. కంటికి, కన్ను పంటికి పన్నులా .. తన వైఖరి ఉండబోతోందని విస్పష్టంగా చెప్పారు ట్రంప్.
ట్రంప్ కామర్స్ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్‌ను ఎంపిక చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక ట్యాక్స్‌లు విధిస్తున్నాయి. కానీ మేం ఆయా దేశాల వస్తువులపై పన్నులు విధించడం లేదని తేల్చి చెప్పారు. ఇకపై అలా చేయడం కుదరదు.. వాళ్లు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్ వేస్తే.. మేం కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై సుంకాలు విధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, అధిక మొత్తంలో ట్యాక్సులు విధించే జాబితాలో బ్రెజిల్, భారత్‌లు ఉన్నాయని తెలిపారు. అమెరికాకు చెందిన వస్తువులపై రూ.100 నుంచి రూ.200 వరకు బ్రెజిల్, భారత్‌లు వసూలు చేస్తున్నాయి.. మేం కూడా అదే స్థాయిలో సుంకాలు వసూలు చేయబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ మొండితనం.. నాయకత్వ పటిమ గురించి భారత ప్రధాని మోడీకి బాగా తెలుసు. మరి ట్రంప్ నేరుగా ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. దీనికి భారత్ నుంచి ఎలాంటి ప్రతిస్పందనఉంటుందో వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కెనడా.. తన విధానాలు మార్చుకుంటోంది. మిగిలిన దేశాలు కూడా తమ వాణిజ్య విధానాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు ట్రంప్. లేదంటే వాణిజ్య యుద్ధానికి తెరతీసినట్లే అని చెబుతున్నారు నిపుణులు.






