Pakistan: పాకిస్తాన్ కు తాలిబన్ ముప్పు…
పాముకు పాలుపోసి పెంచితే ఏమవుతుంది.. పెంచినవాడినే కాటేస్తుంది. ఇదే పరిస్థితి పాకిస్తాన్ కు(pakistan) ఎదురైంది. తమ దేశంలో ఉగ్రవాద దుశ్చర్యలకు పాల్పడుతున్న తెహ్రిక్ -ఏ- పాకిస్తాన్ ఉగ్రసంస్థను నిలువరించే ఉద్దేశ్యంతో.. ఆఫ్గాన్ తూర్పు పక్తికా ప్రావిన్స్(paktika province) లోని బార్మల్ జిల్లాలోని నాలుగు గ్రామాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఇందులో 46 మందిప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను అనాగరిక చర్యగా తాలిబన్ రక్షణశాఖ పేర్కొంది. వీటికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ దాడుల్లో వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు సమాచారం. పక్తికా రాష్ట్రంలో మిలిటెంట్లకు శిక్షణ అందిస్తున్న శిబిరాన్ని ధ్వంసం చేసి తిరుగుబాటుదారుల్ని హతమార్చే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని పాకిస్థాన్ భద్రతా వర్గాలు వెల్లడించాయి.
దీంతో పాకిస్తాన్ పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది కాబూల్(kabul). పాక్ సరిహద్దువైపుగా 15వేల మంది తాలిబన్ ఫైటర్లను తరలిస్తోంది. కాబుల్, కాందహార్, హెరాత్ నుంచి పాక్‌కు చెందిన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ను కలిపే బోర్డర్‌వైపు ఈ ఫైటర్లు వెళ్తున్నట్లు తెలుస్తోంది.ఇంతమంది ఫైటర్లను పాక్ వైపు తాలిబన్లు పంపిస్తుండడం.. ఇస్లామాబాద్ కు టెర్రర్ తెప్పిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ బేసిగ్గా వీక్ గా ఉంటుంది. మరోవైపు.. తాలిబన్లు అన్నిరకాలుగా ఆరితేరి ఉన్నారు. వీరిని ఎదుర్కోవడం అంటే కాస్త కష్టమైన పనే అని చెప్పొచ్చు.
ఆఫ్గనిస్తాన్ ను ఆక్రమించేందుకు తాలిబన్లకు పాకిస్తాన్ సాయం చేసింది. ఎందుకంటే నాటి ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం.. ఇండియాతో సాన్నిహిత్యంగా ఉండేది. ఈపరిణామంలో తాలిబన్లకు అన్నీ తానై సాయం చేసింది. ఇప్పుడు దేశంలో తాలిబన్ పాలన ఏర్పడింది. దీంతో ఇరుదేశాల మధ్య మంచి స్నేహం ఉంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి టీటీపీ గ్రూప్ ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా పాక్ భద్రతా సిబ్బంది, ప్రజలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. కాబుల్‌లో దాని మిత్రులు మాదిరిగానే టీటీపీ పాక్‌లో ఇస్లామిక్ ఎమిరేట్‌ను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా తాను పెంచిపోషించిన తాలిబన్లే ఇప్పుడు పాక్‌ను కాటేసేందుకు సిద్ధమయ్యారు.






