Shiek Hasina: హసినాను అప్పగించండి.. భారత్ కు బంగ్లాదేశ్ దౌత్యసందేశం…
బంగ్లాదేశ్(Bangladesh) పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. ముందుగా ప్రధాని పదవిలో ఉన్న సమయంలో హసీనాను నిర్భందిస్తే మరో తిరుగుబాటు వచ్చేప్రమాదం ఉందని గ్రహించి.. ఆమె దేశం విడిచివెళ్లేందుకు సహకరించింది సైన్యం. ఎప్పుడైతే ఆమె దేశం వదిలిపారిపోయారో.. ఇంకేముంది.. క్షేత్రస్థాయిలో అతివాదులు బలాన్ని పెంచుకున్నారు. సైన్యంపైనా పట్టి సాధించారు. కీలుబొమ్మలాంటి యూనస్ సర్కార్ ను నిలబెట్టారు. తమపై అనుమానం రాకుండా అన్ని రంగాల్లోనూ తమ అనుకున్నవారిని కూర్చొపెట్టారు. నెమ్మదిగా అసలు ఆట మొదలు పెట్టేశారు.
ఇప్పుడు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని కోరుతూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం(Interior government) భారత ప్రభుత్వానికి ఒక దౌత్య సందేశం పంపింది. దీంతో ఇరు దేశాల సంబంధాల్లో ఇప్పటికే నెలకొన్న సందిగ్ధత మరింత జటిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్_(high commission) నుంచి తమకు దౌత్య సందేశం వచ్చిన మాట నిజమేనని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. హసీనాను న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సివున్నందున ఆమె అప్పగింతను కోరుతున్నామని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తౌహీద్ హుసేన్ అన్నారు. అయితే ‘‘ఈ వ్యవహారంపై తాము వ్యాఖ్యానించాల్సిందేమీ లేదు’’ అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
పదహారేళ్లుగా కొనసాగుతున్న షేక్ హసీనా ప్రభుత్వం గత ఆగస్టులో జరిగిన తిరుగుబాటు కారణంగా పతనమైంది. హసీనా ఆగస్టు 5 నుంచి భారత్‌లోనే నివసిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ఐసీటీ) హసీనాతోపాటు ఆమె మంత్రివర్గ సహచరులు, సలహాదారులు, సైనిక, పౌర అధికారుల కోసం అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
భారత బంగ్లాదేశ్‌లు నేరస్థుల అప్పగింతకు సంబంధించిన ఒడంబడికలో భాగస్వాములు. అయితే ఈ ఒప్పందం ఓదేశంలో నేరం చేసి, మరో దేశంలో తలదాచుకున్నవారికి వర్తిస్తుంది. కానీ ఇక్కడ.. షేక్ హసీనా రాజకీయనేత. అదీ కాక ఇండియా ఆశ్రయం కోరి వచ్చారు.ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయమైన తీసుకునే హక్కు భారత్ కు ఉంటుంది.






