Bangladesh: కృష్ణదాస్ కు బంగ్లా కోర్టులో ఎదురుదెబ్బ..
బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దేశద్రోహం కేసులో అరెస్టైన .. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ కు ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా దేశ్ కోర్టులో అతనికి ఊరట లభించలేదు. ఆయన బెయిల్ పిటిషన్ ను చటోగ్రామ్(Chatogram) లోని కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం 11 మంది లాయర్ల బృందం ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు.
చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో 30 నిమిషాల పాటు ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. చిన్మయ్ అరెస్టు అనంతర పరిణామాలను దృష్టిలోపెట్టుకొని గురువారం న్యాయస్థానం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి ఆయనకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది.
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్(Iskcon) ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబరులో చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయజెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబరు 25న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించగా.. అతడిపై ఆందోళనకారులు దాడి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కేసును టేకప్ చేయగా.. ఆయనపైనా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో చిన్మయ్ కేసును వాదించేందుకు ఎవరూ ముందుకురాలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ.. 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది.






