పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు.. ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణలు భారతీయ నావిక రంగానికి తీరని లోటును మిగిల్చాయి. ఒమన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ధ్రువీకరించింది. ఈ దాడుల్లో మరో భారతీయుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
భద్రతా హెచ్చరికలు , నిఘా
గల్ఫ్ ఆఫ్ ఒమన్, హోర్ముజ్ జలసంధి, , పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో క్షిపణులు , డ్రోన్ దాడుల ముప్పు పొంచి ఉందని షిప్పింగ్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లందరూ అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అడ్వైజరీ జారీ చేసింది. సముద్ర మార్గాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే నివేదించాలని సూచించింది. అయితే, ప్రస్తుతానికి భారత జెండా ఉన్న నౌకలను బంధించినట్లు ఎటువంటి సమాచారం అందలేదని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథన్ స్పష్టం చేశారు.
సహాయక చర్యల కోసం క్విక్ రెస్పాన్స్ టీమ్
పర్షియన్ గల్ఫ్ సమీపంలో చిక్కుకుపోయిన భారతీయ నావికులకు తక్షణ సాయం అందించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక ‘క్విక్ రెస్పాన్స్ టీమ్’ (Quick Response Team) ను రంగంలోకి దింపింది. ఈ బృందంలోని అధికారులు ప్రభావిత నావికులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారి కుటుంబాలకు , షిప్పింగ్ కంపెనీలకు భరోసా కల్పిస్తున్నారు. గాయపడిన , రక్షించబడిన సిబ్బందిని సురక్షితంగా భారత్కు తీసుకురావడానికి ఒమన్లోని భారత రాయబార కార్యాలయం వేగంగా చర్యలు చేపడుతోంది. విదేశాల్లోని భారతీయ మిషన్లు, పోర్ట్ అధికారులు , ట్రేడ్ యూనియన్లతో సమన్వయం చేసుకుంటూ నావికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

















