KCR – Jagan: కేసీఆర్, జగన్‌ను ఇరుకున పెట్టిన స్టాలిన్..!

ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైట్ వెలుగుతుందని తెలుసుగా.! ఇప్పుడు దక్షిణాది (South India) పరిస్థితి అలాగే ఉంది. ఉత్తర భారతంపై పోరుకు సిద్ధమయ్యారు డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ (Stalin).! ఇందుకోసం దక్షిణ భారత రాజకీయ నేతలందరినీ కలుపుకు పోయేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాజకీయ పార్టీల నేతలందరికీ లేఖ కూడా రాశారు. ఇందులో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కూడా ఉన్నారు. మరి ఈ సమావేశానికి కేసీఆర్, జగన్ హాజరవుతారా.. ఉత్తరాదిపై పోరులో గళం కలుపుతారా.. అనేది ఆసక్తి రేపుతోంది.
జాతీయ విద్యా విధానంలో (New Education Policy) త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే రాబోయే జనగణన (Delimitation) తర్వాత దక్షిణాదికి చట్టసభల్లో ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గనుంది. ఆర్థిక అసమానతలు కూడా ఎక్కువ కానున్నాయి. వీటన్నిటిపై చర్చించేందుకు దక్షిణాది ప్రముఖులందరినీ కలుపుకు పోవాలని స్టాలిన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 22న చెన్నైలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో పాలుపంచుకోవాలని రాజకీయ పార్టీలకు (political parties) లేఖలు రాశారు. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు కూడా లేఖలు పంపారు. అయితే వీళ్లు ఎన్డీయేలో (NDA) భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి హాజరు కాకపోవచ్చు.
అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు, స్టాలిన్ కు మధ్య సత్సంబంధాలున్నాయి. పైగా కేసీఆర్ కూడా స్టాలిన్ లాగే గతంలో ఉత్తరాధి ఆధిపత్యంపైన ముఖ్యంగా బీజేపీ విధానాలపైన అనేక విమర్శలు చేశారు. బీజేపీపై పోరాటానికి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల అధినేతలను కలిసి పోరుకు పిలుపునిచ్చారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు స్టాలిన్ పిలుపుకు స్పందించి కేసీఆర్ వెళ్తే బీజేపీ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. కుమార్తెపై ఢిల్లీ లిక్కర్ కేసు వేలాడుతూనే ఉంది. వెళ్లకపోతే బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటేనని తాను ముందు నుంచీ చెప్తున్నా అని రేవంత్ రెడ్డే విమర్శించడం మొదలు పెడతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి (Revanth Reddy) డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయంపై ముందే గళమెత్తారు. ఇది కేసీఆర్ కు కచ్చితంగా పరీక్షా సమయమే.!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే.! హాజరయితే బీజేపీ హైకమాండ్ ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలే ఓటమితో పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లి పోరాడడం అనేది కత్తిమీద సామే.! ఒకవేళ వెళ్లకపోతే బీజేపీతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవట్లేదని విమర్శలు ఎదుర్కోవాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్డీయేలో భాగస్వాములు కాబట్టి ఎలాగైనా విమర్శలు ఎదుర్కోక తప్పదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా బీజేపీతో అంటకాగుతున్నారని జనం ధ్వజమెత్తడం ఖాయం. కానీ జగన్ పరిస్థితి అలా కాదు. మీటింగ్ కు వెళ్తేనే జనం నమ్ముతారు. వెళ్లకపోతే ఈయన కూడా ఇంతే అనే ఫీలింగ్ కు వచ్చేస్తారు. అలా కేసీఆర్, జగన్ ను స్టాలిన్ ఇరుకున పెడుతున్నారు.