YS Jagan: జగన్‌పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఏపీలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ 2024లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ (YS Jagan) పదేపదే చెప్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ (AP Assembly) గడప తొక్కట్లేదు. దీంతో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు కూడా వీళ్లు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. జగన్ తీరు సరిగా లేదని, ఇలాగైతే కష్టమేనని వాళ్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లెవరైనా అసెంబ్లీకి వెళ్లి తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలనుకుంటారు. అధ్యక్షా అని నోరారా పిలవాలనుకుంటారు. తమ నియోజకవర్గ ప్రజలకు అసెంబ్లీలో తాను లేవనెత్తిన సమస్యలు చేరాలనుకుంటారు. ముఖ్యంగా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ కోరిక ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు అలాంటి అదృష్టం లేకుండా పోయింది. అసెంబ్లీ కొలువైన తర్వాత ప్రమాణ స్వీకారానికి తప్ప మళ్లీ ఆ సభ గడప తొక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి వెళ్తేనే బాగుంటుందని, ఇలా బాయ్‌కాట్ చేయడం సరికాదని వాళ్లు చెప్పారట. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా, ఒంటరిగా అయినా అసెంబ్లీకి వస్తారని, అధికారపక్షం ఏకమై ఆయనపై దాడి చేసినా ఆయన వెరవరని, ఆయన్ను చూసి మనం నేర్చుకోవాలని సూచించారట.! అయితే ఆ ఎమ్మెల్యేల మాటలను హైకమాండ్ పట్టించుకోలేదని సమాచారం. అందుకే తమ మానాన తమను వదిలేయాలని, తాము పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేమని తేల్చి చెప్పి వచ్చేశారట.!
కొంతమంది ఎమ్మెల్యేలు అధికార కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అధికార పార్టీల నుంచి వాళ్లను చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీలను వైసీపీ ఎమ్మెల్యేలు సంప్రదించారు. అయితే 164 సీట్లు గెలిచిన తర్వాత కూడా వైసీపీ వాళ్లను చేర్చుకుంటే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని, కాబట్టి అలాంటి పనులు చేయాలనుకోవట్లేదని ఆయా పార్టీలు క్లారిటీ ఇచ్చాయట. దీంతో అటూఇటూ కాకుండా పోయామనే ఆవేదనతో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) ఇంటికే పరిమితమయ్యారని తెలుస్తోంది. వీళ్లలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అసలే వెళ్లకుండా ఉంటే వేటు పడుతుందనే భయం వాళ్లను వెంటాడుతుండడమే ఇందుకు కారణమని సమాచారం.