HAL: భారత్ చేతికి సుఖోయ్-57 టెక్నాలజీ…
భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకోబోతోంది. రష్యాకు చెందిన అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57 (సుఖోయ్-57)ను భారీ ఎత్తున ఉత్పత్తి చేసే సామర్థ్యం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు ఉందని రష్యా టెక్నికల్ బృందం నిర్ధారించింది. కేవలం ఉత్పత్తికి అనుమతి ఇవ్వడమే కాకుండా, సోర్స్ కోడ్లు సహా పూర్తి టెక్నాలజీని బదిలీ చేయడానికి కూడా రష్యా ముందుకొచ్చింది. ఈ ఒప్పందం ఖరారైతే, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన Su-57 ఇకపై భారత్‌లోనే తయారు కానుంది.
సుఖోయ్ డిజైన్ బ్యూరో, ఇతర రక్షణ సంస్థలతో కూడిన రష్యా బృందం సెప్టెంబర్ నెలలో హెచ్ఏఎల్ సౌకర్యాలను సందర్శించింది. ఎస్‌యూ-57ఈ యుద్ధ విమానాల దేశీయ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాల్లో దాదాపు 50 శాతం ఇప్పటికే హెచ్ఏఎల్ వద్ద ఉన్నాయని ఈ బృందం తన నివేదికలో స్పష్టం చేసింది. హెచ్ఏఎల్ సుమారు 505 స్టెల్త్ జెట్లను తయారుచేయగలదని నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ పర్యటనకు కొద్ది రోజుల ముందు ఈ నివేదికను సమర్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్ పర్యటనలోనే ఈ కీలక ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గతంలో సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్లను భారత్‌లో విజయవంతంగా ఉత్పత్తి చేసిన అనుభవం హెచ్ఏఎల్కు ఉంది. 2000 సంవత్సరంలో కుదిరిన ఒప్పందం మేరకు ఈ జెట్లను హెచ్ఏఎల్ తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా బృందం బెంగళూరు, నాసిక్, కోరాపుట్‌లోని హెచ్ఏఎల్ యూనిట్లను సందర్శించి, ఇక్కడి తయారీ సామర్థ్యాలను, సాంకేతిక సంసిద్ధతను అంచనా వేసింది.
రష్యా నివేదిక నేపథ్యంలో, పెట్టుబడులు పెట్టాల్సిన కీలక రంగాలను గుర్తిస్తూ హెచ్ఏఎల్ కూడా ఒక అంతర్గత నివేదికను సిద్ధం చేస్తోంది. అత్యాధునిక కాంపోజిట్ మెటీరియల్స్, రాడార్‌ను తప్పించుకునే కోటింగ్స్, డిజిటల్ డిజైన్, నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ టెస్ట్ బెడ్స్ వంటి వాటిపై దృష్టి సారించనుంది.
Su-57E జెట్ల సంయుక్త ఉత్పత్తి భారత వైమానిక దళాన్ని (IAF) గణనీయంగా బలోపేతం చేస్తుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తగ్గుతున్న ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్ల సమస్యను అధిగమించడంతో పాటు, ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో భారత్ స్థాయిని ఇది మరింత పెంచుతుంది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న AMCA ఐదో తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్‌కు కూడా ఈ ప్రాజెక్ట్ అదనపు బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.







