Trump: అమెరికా అధ్యక్షుడి నోట ప్రపంచ వినాశనం మాట..!
గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు ప్రపంచ వినాశనం గురించి ఇంత పబ్లిగ్గా మాట్లాడలేదు. ఆఖరికి సోవియట్ యూనియన్ తో కోల్డ్ వార్ సమయంలో కూాడా అణుపరీక్షలు చేసుకున్నారే తప్పా.. ఇంతలా విధ్వంసం సృష్టించగలమని ఏ ఒక్కరు చెప్పలేదు. కానీ.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్(US President Donald Trump) మాత్రం.. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని తెలిపారు.. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్‌లో ఈ మేరకు మాట్లాడారు.
‘‘అణు నిరాయుధీకరణ అనేది గొప్ప విషయం. మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో మేం ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం. అయితే ఆ అవసరం లేదు. ప్రతిఒక్కరూ డబ్బును అణ్వాయుధాలపై కాకుండా ఇతర విషయాలు ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిపై ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానిని సాధించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. ప్రజలకు తెలియని ఎన్నో యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం అవి లేవు’’ అని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు.
మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఇటీవల ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న అగ్ర రాజ్యాధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను (Trump on Nuclear Tests) పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ (Pakistan) కూడా ఉందని పేర్కొన్నారు. ‘‘రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయి. మా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయి. మావద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చు. కానీ, అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చించా’’ అని ట్రంప్ తెలిపారు. అయితే ఎక్కడ, ఎప్పుడు ఈ పరీక్షలు నిర్వహించనున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.







