Donald Trump: త్వరలో భారత పర్యటనకు ట్రంప్.. !
ఎడా పెడా టారిఫ్ లతో భారత్ పై పెనుభారం మోపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఆయన పర్యటన ఉండే అవకాశం కనిపిస్తోంది.ఈ విషయంపై స్వయంగా హింట్ ఇచ్చిన ట్రంప్.. ప్రధాని మోడీ (PM Modi)పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాని మోడీతో వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు ట్రంప్… ‘మోడీ.. రష్యా నుంచి చమురు కొనడం చాలావరకు మానేశారు. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. నేను అక్కడికి రావాలని ఆయన కోరుకుంటున్నారు. మేము దాన్ని పరిశీలిస్తున్నాం. నేను వెళ్తాను. ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి’ అని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది భారత్ (India)లో పర్యటించాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? అని ఓ విలేకరి ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘అలా కావొచ్చు. అవును’ అని పేర్కొన్నారు.
ప్రముఖ ఊబకాయం మందుల ధరల తగ్గింపు లక్ష్యంగా పలు ఫార్మా కంపెనీలతో ట్రంప్ కీలక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం గురించి వైట్‌హౌస్‌లో విలేకరులకు వివరిస్తుండగా.. అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ పక్కన ఉన్న.. ఓ ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కార్యక్రమానికి కొంతసేపు అంతరాయం కలిగింది. పడిపోయిన వ్యక్తి నోవో నార్డిస్క్ ఎగ్జిక్యూటివ్ గోర్డాన్ ఫైండ్లేగా తెలుస్తోంది. ఈ సంఘటనపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ మాట్లాడుతూ.. ఆయన స్పృహ తప్పారని వెల్లడించారు. వైట్‌హౌస్ వైద్యబృందం వెంటనే స్పందించి ఆయనకు చికిత్స అందించినట్లు తెలిపారు







