Chevireddy: చెవిరెడ్డి గారూ.. కోర్టు వద్ద హంగామా అవసరమా..?

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ (YCP) ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు (Liquor Scam Case) రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కోర్టుకు వచ్చిన ప్రతిసారీ గట్టిగా అరుస్తూ, తనపై తప్పుడు కేసు పెట్టారని చెబుతున్నారు. తనకేమీ తెలియదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం ముట్టుకోని తనపై మద్యం కేసు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మద్యం తాగుతున్నాడనో, అమ్ముతున్నాడనో చెవిరెడ్డిపై కేసు పెట్టలేదు. మద్యం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును ఎన్నికల ప్రచారానికి వాడుకున్నందుకు చెవిరెడ్డిపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని కవర్ చేసేందుకు తాను సచ్చీలుడినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు చెవిరెడ్డి.
ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం వ్యాపారంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో దాదాపు రూ.3,500 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చెబుతోంది. మద్యం దుకాణాల కాంట్రాక్టులు, డబ్బు రవాణా, ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు తరలించడం వంటి వాటిలో ఈ అక్రమాలు జరిగాయి. ఎన్నికల సమయంలో రూ. 250 కోట్ల డబ్బు హవాలా మార్గాల ద్వారా తరలించారని సిట్ ఆరోపిస్తోంది. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లలో సిట్ దాడులు చేసి, కంపెనీల పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేశారు, 39 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో ఏ38గా ఉన్నారు. జూన్ 17న ఆయన్ను బెంగళూరు ఎయిర్‌పోర్ట్ లో అరెస్టు చేశారు. శ్రీలంకకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా, లుక్‌అవుట్ నోటీస్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. ఆయన పీఏ వెంకటేశ్ నాయుడు (ఏ-34) కూడా అరెస్టయ్యాడు. విజయవాడకు తీసుకొచ్చి, ఏసీబీ కోర్టులో హాజరు చేసిన తర్వాత రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైలులో ఉన్నారు.
చెవిరెడ్డిని అరెస్టు చేసింది ఆయన మద్యం తాగారనో, అమ్మారనో కాదు. మద్యం వ్యాపారంలో అక్రమంగా వచ్చిన డబ్బును తరలించడంలో ఆయనకు పాత్ర ఉందని సిట్ చెబుతోంది. ఆయన వాహనంలో ఆయన పీఏలు డబ్బు తరలించారని, దానికి వీడియో ఆధారాలు ఉన్నాయని సిట్ తెలిపింది. ఎన్నికల సమయంలో రూ. 8.2 కోట్లు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద రూ. 8 కోట్లు పట్టుబడ్డాయి. చెవిరెడ్డి పీఏలు బాలాజి, నవీన్‌లను కూడా అరెస్టు చేశారు. వెంకటేశ్ నాయుడు ఫోన్‌లో రూ.35 కోట్లు లెక్కించే వీడియో కూడా సిట్ కి దొరికింది. చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి కూడా సిట్ నోటీసు ఇచ్చింది. ఆయన కంపెనీలకు, ఈ కేసులో మరో నిందితుడైన విజయానంద్ రెడ్డి కంపెనీలకు సంబంధం ఉందని సిట్ గుర్తించింది. చిత్తూరు, తిరుపతిలో దాడులు చేసి, ఆధారాలు సేకరించారు.
చెవిరెడ్డి కోర్టుకు వచ్చిన ప్రతిసారీ గట్టిగా అరుస్తారు. “నేను మద్యం తాగలేదు, అమ్మలేదు. నన్ను తప్పుడు కేసులో ఇరికించారు” అని చెబుతారు. తన తల్లిదండ్రులు, సోదరుడు మద్యం వల్ల చనిపోయారని, తాను వేద పాఠశాల నడుపుతున్నానని అంటారు. జూలై 2025లో విజయవాడ సబ్ జైలు వద్ద కూడా ఇలాంటి హడావిడి చేశారు. ఎస్‌ఐటీ అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కోర్టు ఒకసారి చెవిరెడ్డిని మందలించింది. “కోర్టు బయట హుందాగా ఉండండి” అని చెప్పింది. అయినా, ఆయన తీరు మారలేదు. సుప్రీం కోర్టు కూడా ఈ అరెస్ట్ లో తప్పు లేదని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థించింది.
టీడీపీ నాయకులు చెవిరెడ్డిని తప్పు పడుతున్నారు. “మద్యం తాగకపోతే దోషి కాకుండా పోతారా? ఈ అక్రమాల్లో నీవు లేనట్టు ప్రమాణం చేయగలవా?” అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారంలో అక్రమాలు చేసిందని, చెవిరెడ్డి వంటి నాయకులు దీనిలో భాగమని ఆరోపిస్తున్నారు. వైసీపీ మాత్రం, టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసులు పెడుతోందని అంటోంది. చెవిరెడ్డి మాత్రం కోర్టుకు వచ్చిన ప్రతిసారీ ఇదే పాట పాడుతూ టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.