BRS: బీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు..! వాట్ నెక్స్ట్..?

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ (BRS) తరపున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. వాళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు (Spreaker) ఆదేశాల మేరకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) వీరికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నామంటూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు లిఖితపూర్వక సమాధానాలు సమర్పించారు. ఈ సమాధానాలను స్పీకర్ ఫిర్యాదుదారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపారు. మూడు రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలని సూచించారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల తర్వాత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన (BRS MLA) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), సంజయ్ (జగిత్యాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలె యాదయ్య (చేవెళ్ల), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్ పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్) కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. వీళ్లంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఫొటోలు, వీడియోలు మీడియాలో విస్తృతంగా వచ్చాయి. దీంతో పార్టీ ఫిరాయించారంటూ వీళ్లపై వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వీళ్లపై అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో.. బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టును, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2025 మార్చి 4న సుప్రీంకోర్టు స్పీకర్‌కు నోటీసు జారీ చేసి, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. జూలై 31న మరోసారి సుప్రీంకోర్టు, స్పీకర్‌కు మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 12లోపు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రొసీడింగ్స్ ను ఆలస్యం చేయకూడదని తేల్చి చెప్పింది. దీంతో ఆగస్టు 20న స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సమాధానాలు సమర్పించారు.
స్పీకర్ కార్యాలయానికి అందిన వివరణల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని చెప్పినట్లు తెలుస్తోంది. మేము పార్టీ మారలేదని, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిని కేవలం అభివృద్ధి పనుల కోసమేనని. అది రాజకీయ మార్పు కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీఎం స్థాయి వ్యక్తి మర్యాదపూర్వకంగా కండువా కప్పారని, దాన్ని తిరస్కరించడం సంస్కారం కాదని ఆ వివరణలో ప్రస్తావించారు. అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని కూడా స్పష్టం చేశారు. మా ఇంట్లో, కార్యాలయంలో కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరినట్లు కొంతమంది ఫ్లెక్సీలు వేస్తే వాళ్లపై కంప్లెయింట్ చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు. అరెకపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు కూడా ఇదే తీరుగా సమాధానాలు ఇచ్చారు. కానీ, కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం మరింత గడువు కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడం పెద్ద సమస్యగా మారింది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ సమాధానాలను ఫిర్యాదుదారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గురువారం పంపారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమాధానాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డికి, అరెకపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్‌ల సమాధానాలను డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్‌ల సమాధానాలను జగదీశ్ రెడ్డికి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య సమాధానాలను చింతా ప్రభాకర్‌కు, తెల్లం వెంకట్రావు సమాధానాన్ని కేపీ వివేకానందకు పంపారు. కడియం శ్రీహరి సమాధానం వచ్చిన తర్వాత కేపీ వివేకానందకు, దానం నాగేందర్ సమాధానాన్ని పాడి కౌశిక్ రెడ్డికు పంపే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉన్నందున, మూడు రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలని స్పీకర్ సూచించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు ఈ సమాధానాలు పంపి, విశ్లేషణ చేయమని ఆదేశించారు. ఫిర్యాదు సమయంలో సమర్పించిన ఫొటోలు, వీడియోలు, పత్రికా కథనాలు, ఇప్పుడు ఎమ్మెల్యేల సమాధానాల మధ్య తేడాలపై న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. స్పీకర్ నిర్దేశించిన గడువులోపు బీఆర్ఎస్ సమగ్ర సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి షాక్‌గా మారింది. ఎమ్మెల్యేలపై అనర్హత ఖాయమని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే తాము పార్టీ మారలేదంటూ ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. దీంతో బీఆర్ఎస్ ఎలాంటి సమాధానాలు ఇస్తుంది.. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ సమీపిస్తున్నందున ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.