Donald Trump: త్వరలో డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన!

భారత్‌లో త్వరలో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హాజరయ్యే అవకాశం ఉందని భారత్‌కు అమెరికా రాయబారిగా డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నియమించిన సెర్గియో గోర్ (Sergio Gore) తెలిపారు. ఆయన సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీతో మాట్లాడుతూ ఈ సదస్సుకు హాజరవడంతో పాటు క్వాడ్ (Quad) బలోపేతానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని పేర్కొన్నారు.
భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవడమే తమకు అత్యంత ప్రాధాన్యమని గోర్ స్పష్టం చేశారు. భారత్ (India) ను అమెరికాకు చేరువ చేయడంతో పాటు చైనాకు దూరం చేయడమే లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య నెలకొన్న తాత్కాలిక అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం, ప్రజలతో తమ దేశానికి దశాబ్దాల నుంచి సత్సంబంధాలు ఉన్నాయని, చైనీయులతో కంటే కూడా అమెరికన్లతోనే వారికి సాన్నిహిత్యం ఎక్కువని గోర్ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది చివర్లో క్వాడ్ దేశాధినేతల సదస్సును భారత్ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా ఈ సమావేశానికి హాజరు కావాలని డొనాల్డ్ ట్రంప్ ను ప్రధాని మోదీ (Modi) ఆహ్వానించారు.