Dhaka: బంగ్లాదేశ్ భారత వ్యతిరేక కార్యకలాపాల వెనకున్నదెవరు…? యూనస్ సర్కార్ ఎందుకు పాకిస్తాన్ కు సాగిలపడుతోంది..?
బంగ్లాదేశ్ .. రోజురోజుకూ దిగజారిపోతోంది.మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత, నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ అధికార దాహం కారణంగా.. పొరుగుదేశాల కాళ్లమీద పడమన్నా పడేస్థాయికి పతనమైంది. ఇటీవలే పాకిస్తాన్ నుంచి హఫీజ్ సయీద్ అత్యంత సన్నిహితుడు ఇబ్తిసామ్ ఎలాహీ జహీర్.. బంగ్లాదేశ్ లోపర్యటించాడు. భారత్ విశాల సరిహద్దుల్లో పర్యటించి.. ఇండియాకు వ్యతిరేకంగా ప్రసంగించాడు. అంతేకాదు.. మతసామరస్యానికి విఘాతం కలిగించేలా, స్థానికుల్లో భారత వ్యతిరేకత ప్రోగుచేసేలా ప్రసంగాలు చేశాడు.భారత ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించేందుకు జరుగుతున్న పెద్ద కుట్రలో ఇది భాగమని అనుమానాలు బలపడుతున్నాయి.
పాకిస్థాన్‌కు చెందిన ‘మర్కజీ జమియత్ అహ్ల్-ఎ-హదీత్’ ప్రధాన కార్యదర్శి అయిన జహీర్ ఈ నెల 25న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చేరుకున్నాడు. గత రెండు రోజులుగా రాజ్షాహి, నవాబ్‌గంజ్ వంటి భారత సరిహద్దు జిల్లాల్లో పర్యటించాడు. ఈ వారం రంగ్‌పూర్‌కు కూడా వెళ్లనున్నాడు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జహీర్ బంగ్లాదేశ్‌కు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2025 ఫిబ్రవరిలో కూడా వారం రోజుల పాటు ఇక్కడే ఉన్నాడు.
కశ్మీర్‌పై విషం కక్కిన జహీర్
నవాబ్‌గంజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జహీర్ మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. “ఇస్లాం కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండాలి. మీ పిల్లలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడాలి. లౌకిక, ఉదారవాద శక్తులను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు ముస్లింలందరూ ఏకమై లౌకికవాదులకు వ్యతిరేకంగా పోరాడాలి” అని పిలుపునిచ్చాడు. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ “కశ్మీరీల స్వేచ్ఛను అణిచివేస్తున్నారు. భారత కశ్మీర్లో ఇస్లాం వ్యతిరేక చట్టాలు, దమనకాండకు వ్యతిరేకంగా పాకిస్థాన్ గట్టిగా గళం విప్పాలి. అల్లా దయతో కశ్మీర్ పాకిస్థాన్‌లో భాగమయ్యే రోజు వస్తుంది” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో తీవ్రవాద నెట్‌వర్క్‌లకు అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో హసీనా ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను కఠినంగా అణచివేసింది. అయితే, ప్రస్తుత యూనస్ మధ్యంతర పాలనలో ఉగ్రవాద సంస్థలు మళ్లీ క్రియాశీలమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జహీర్ తన పర్యటనలో భాగంగా నవంబర్ 6, 7 తేదీల్లో రాజ్‌షాహిలో జరిగే భారీ సలాఫీ సదస్సులో ప్రసంగించనున్నాడు. అతడు నవంబర్ 8న పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లనున్నాడు. హఫీజ్ సయీద్‌తో పాటు, పరారీలో ఉన్న భారతీయ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌తో కూడా జహీర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ 2024 అక్టోబర్‌లో పాకిస్థాన్‌లో కలుసుకున్నారు. జహీర్ పర్యటన వెనుక భారత వ్యతిరేక కుట్ర దాగి ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.







