Nara Lokesh: టెట్ తీర్పుపై ఉపాధ్యాయుల ఆందోళన ..రివ్యూ పిటిషన్ కు సిద్ధమైన ప్రభుత్వం
ఉపాధ్యాయుల టెట్ (TET) ఆందోళన మరోసారి విద్యా రంగంలో చర్చనీయాంశమైంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, 2010 అక్టోబర్ 23కు ముందు డీఎస్సీ (DSC) ద్వారా నియామకం పొందిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయాల్సిందేనని ఆదేశాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను టీడీపీ (TDP) ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Alapati Rajendra Prasad), భూమిరెడ్డి రాంగోపాలరెడ్డి (Bhoomireddy Ramgopal Reddy) రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) దృష్టికి తీసుకెళ్లారు.
ఉపాధ్యాయుల సమస్యను వివరించిన ఎమ్మెల్సీలు, సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూనే, ఉపాధ్యాయుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని రివ్యూ పిటిషన్ (Review Petition) దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, 2025 సెప్టెంబర్ 1 నాటికి రిటైర్మెంట్కు ఐదేళ్లు మిగిలి ఉన్న ఎస్జీటీ (SGT) , స్కూల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24, 2025న టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఆదేశాలు పలు జిల్లాల్లోని (districts) టీచర్లలో తీవ్ర ఆందోళన కలిగించాయి.
20 నుంచి 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ రాయల్సిన పరిస్థితి రావడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టెట్ పాస్ కాకపోతే ఉపాధ్యాయ హోదా కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో వారు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు, ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారు కూడా ప్రమోషన్ పొందాలంటే టెట్ తప్పనిసరి చేయడంపై కూడా ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు ఈ సమస్యపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారు “సుప్రీంకోర్టు ఆదేశాలు గౌరవనీయమైనవే కానీ, ఈ తీర్పు మా దీర్ఘకాల సేవల విలువను తగ్గిస్తోంది” అని అంటున్నారు.
మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై మాట్లాడుతూ, “సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహించాల్సిందే కానీ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా రివ్యూ పిటిషన్ వేసి, వారిపై అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. అయితే మంత్రి ఇచ్చిన హామీతో పాటు, సుప్రీంకోర్టు తీర్పును పాటిస్తామని చెప్పడంతో కొందరు ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. “ఒకవైపు టెట్ తప్పనిసరి అంటున్నారు, మరోవైపు రివ్యూ వేస్తామంటున్నారు — ఇది ఏం పితలాటకమో?” అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆందోళనలను పరిష్కరించేందుకు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. టెట్ విషయంలో తగిన సడలింపులు ఇవ్వాలని, లేదా దీర్ఘకాల సర్వీస్ ఉన్నవారికి మినహాయింపులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు (Teachers’ Associations) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.







